యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న విషయం తెలిసిందే. భారత దేశంలో ఎంతో మంది ఈ వైరస్ బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. కొద్ది కాలంగా వైరస్ సోకిన వారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ ఇంకా పూర్తిగా తగ్గలేదనేది వాస్తవం. దీని బారిన పడి మరణించిన వారు కొందరైతే, కోలుకున్న వారు కొందరు.
తాజాగా తెలంగాణ మాజీ హోంమంత్రి, తెరాస సీనియర్ నాయకుడు నాయిని నరసింహరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నెల 28న నాయినికి కరోనా సోకింది. అప్పటి నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు. ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా కనిపించే నాయిని కరోనా నుంచి త్వరలోనే కోలుకుంటున్నారని అందరూ ఆశించారు. అనుకున్నట్లుగానే వారం క్రితం మరోసారి నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ కూడా వచ్చింది. దీంతో త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని అంతా అనుకున్నారు.
ఒక్కసారిగా విషమం..
కానీ ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకి న్యూమోనియా వచ్చిందని గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ అడ్వాన్స్ డ్ క్రిటికల్ కేర్ యూనిట్ లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నాయినికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
కుటుంబ సభ్యులందరికీ సోకిన వైరస్
నాయిని నరసింహారెడ్డి భార్య అహల్యకు సైతం కరోనా సోకింది. దీంతో ఆమె కూడా బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ఆమెకు నెగెటివ్ నిర్ధారణ అయినప్పటికీ మరింత మెరుగైన చికిత్స కోసం ఆమె ఆసుపత్రిలోనే ఉన్నారు. నాయిని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన పెద్ద కుమారుడికి సైతం కరోనా సోకింది.











