కరోనా ఎవరిపైనా కనికరం చూపించడం లేదు. కరోనా ఎవరినీ ఉపేక్షించడం లేదు. కరోనా ఎవరినీ కలకాలం బతకనివ్వడం లేదు. కరోనా డబ్బున్న వారు అని లేదు. నిరుపేదలని లేదు. డాక్టర్లను వదలడం లేదు. యాక్టర్లని వదలడం లేదు. పోలీసులని చూసి భయపడడం లేదు. దొంగలను చూసి దాక్కోటం లేదు. సమాజంలో ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తున్న కరోనా చివరికి కళాకారుల జీవితాలకు కుదేపిస్తోంది. కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాలలో పలువురు కళాకారులు కన్నుమూసారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాల ఊపిరిగా భాసించిన ఉ.సాంబశివరావు (ఉ.సా) కరోనా కాటుకు బలయ్యారు. 70 సంవత్సరాల వయసులో ఉన్నా ఆయన చాలా యాక్టివ్‌గానే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఏ ప్రజా ఉద్యమం జరిగినా అక్కడ ఉ.సా ప్రత్యక్షమయ్యేవారు. కవి, కథకుడిగా, విమర్శకుడిగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరున్న ఉసా… కంటికి కనిపించని క్రిమికి బలైపోయారు.
ఫొటోగ్రాఫీ అన్న మాట వినగానే గుర్తుకొచ్చే పేర్లలో ఒకటి గోవిందు. ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో ఉద్యోగం నెరపిన గోవింద్ కరోనా కారణంగానే మరణించారు. పల్లె నుంచి గోవింద్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆ పల్లె అమాయకత్వం నుంచి బయటపడలేదు. గోవింద్‌కు కరోనా వచ్చిందని చుట్టుపక్కల వారికి తెలిస్తే ఏమవుతుందోననే భయంతో ఇంట్లోనే వైద్యం చేయించుకున్నారు. ఇది విషమించి గోవింద్ ప్రాణాలను హరించింది.
అనేక తెలుగు పత్రికకలో కల్చరల్ విలేకరిగా పని చేసిన జీ.ఎల్.ఎన్. మూర్తి కూడా కరోనా కారణంగానే మరణించారు. నాటక రచయితగా, కవిగా పేరున్న మూర్తి మరణం కళారంగాన్ని తీవ్రంగా కలచి వేసింది. కరోనా చికిత్సకు ఆసుపత్రిలో చేరిన మూర్తి కోలుకుంటున్నారనే సమాచారం వచ్చిన రాత్రే శ్వాస అందక మరణించడం విషాధం.
కళాకారులు కాకపోయినా సినీ రంగానికి చెందిన ఇద్దరు నిర్మాతలు కూడా కరోనా కారణంగానే మరణించారు. అయితే, సినీ రంగంలో మరికొందరిని ఈ మహమ్మారి సోకినా దాని బారి నుంచి తప్పించుకున్న వారూ ఉన్నారు.











