మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాధ్‌కు ఒక చిత్రమైన చిక్కు వచ్చి పడింది. ఆ చిక్కును ఆయన సుప్రీం కోర్టులో పరిష్కరించుకోవాలని అనుకున్నారు గానీ.. సాధ్యపడలేదు.
విషయం ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన అనంతరం బీజేపీలో చేరిన సంగతి తెలిసింది. ఆ రకంగా మధ్యప్రదేశ్ లో వారు ఖాళీచేసిన 28 స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. మంగళవారం ఆ ఉపఎన్నికల పోలింగ్ జరగనుంది.
మొత్తం 28 స్థానాలను గంపగుత్తగా సొంతం చేసుకుని.. వారు అక్కడ గతంలో గెలిచారంటే, అందులో కాంగ్రెస్ దయ, బలం ఏమీ లేదని.. వ్యక్తుల బలమేనని చాటిచెప్పడం బీజేపీ ప్రస్తుత టార్గెట్ గా ఉంది. ఇదే సమయంలో వాటిలో కనీసం ఒక్కస్థానాన్నయినా తిరిగి తమ పార్టీ నిలబెట్టుకుంటే తమ పార్టీకి ప్రజాదరణ ఉన్నది గానీ.. బీజేపీ కుట్ర చేస్తోందని చాటిచెప్పే అవకాశం ఉంటుందనేది కాంగ్రెస్ ఆశ. అందుకే పోరు హోరాహోరీగా మారింది.
ఈ ఎన్నికలకు మాజీ సీఎంగా కమల్ నాధ్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. మాజీ మంత్రి ఇమర్తి దేవి గురించి ‘ఐటెం’ అంటూ అసభ్య వ్యాఖ్యలు చేసింది ఆయనే. ఆయనను స్టార్ క్యాంపెయినర్ జాబితానుంచి తొలగిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. అయితే ఒక పార్టీకి స్టార్ క్యాంపెయినర్ లుగా ఎవరుండాలో? ఎవరుండకూడదో? ఈసీ వారు ఎలా డిసైడ్ చేస్తారంటూ ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. దానిపై ఇవాళ విచారణ జరిగింది.
స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ను తొలగిస్తూ ఈసీ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంటే ఆయన స్టార్ క్యాంపెయినర్ హోదా కొనసాగుతుందన్నమాట. కానీ ఫలితమేముంది. ఆల్రెడీ అక్కడి ఎన్నికలకు ప్రచారపర్వం ఆదివారం నాటి సాయంత్రానికే ఆగిపోయింది. ఆయనకు హోదా మిగిలిందే తప్ప.. ప్రచారం చేసే అవకాశం మాత్రంలేదు.
పార్టీ ప్రచార నాయకుడు ఎవరో నిర్ణయించే అధికారం ఎవరిచ్చారని ఈసీని సీజేఐ ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ స్థానాలకు ప్రచారం ముగిసిందని, రేపు ఎన్నికలు జరగనున్నాయని ఈసీ కోర్టుకు తెలిపింది. ప్రచారం ముగిసినందున కమల్ నాథ్ పిటిషన్ చెల్లుబాటు కాదని ఎన్నికల సంఘం వాదించింది. అయితే ప్రాథమికంగా పార్టీ నాయకుడెవరో నిర్ణయించే అధికారం ఈసీకి లేదన్న సుప్రీంకోర్టు, వారి నిర్ణయాన్ని తప్పు పట్టింది. పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని ఈసీకి నోటీసులు జారీ చేసింది.
సుప్రీం మాటలు కమలనాధ్ కు ఊరట కలిగించేవే.. అయితే ఆయనకు ఒనగూరిన ఉపయోగం మాత్రం లేదు.