(లియోన్యూస్ ప్రతినిధి)
వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరి, కృష్ణా నదులు పొంగి పొర్లుతున్నాయి. రెండు వారాలుగా వర్షాలు బీభత్సం సృష్టించాయి. తెలుగు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరంగల్ లాంటి నగరాలు ఎప్పుడూ లేని విధంగా నీట మునిగాయి. హైదరాబాద్ వాసుల కష్టాలు మామూలే.
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగింది. చరిత్రలో మూడో సారి భద్రాచలం వద్ద 70 అడుగుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లోని 273 గ్రామాలు నీట మునిగాయి. పోలవరం ప్రాజెక్టు కూడా అసంపూర్తిగా ఉండటంతో బ్యాక్ వాటర్ గిరిజన గ్రామాలను ముంచెత్తింది. పాత పోలవరం గ్రామం రెండు వారాలుగా నీటిలోనే నానుతోంది. ఇక గోదావరి దవళేశ్వరం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తి 17 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదలడంతో కోనసీమ లోని 13 లంక గ్రామాల్లోని 324 గ్రామాలు నీట మునిగాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే 4 లక్షల మంది నిరాశ్రమయులయ్యారు. ఏపీ సీఎం హెలికాప్టర్ ద్వారా వరద ఏరియల్ సర్వే చేసి బాధిత కుటుంబాలకు రూ.2000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. అయితే గత ఏడాది వరదల సమయంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.5000 సాయం నేటికీ అందలేనది వరద బాధితులు వాపోతున్నారు.
కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణా నదికి భారీ వరద వస్తోంది. నారాయణపూర్, తుంగభద్ర, ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. శ్రీశైలం నుంచి 10 గేట్లు ఎత్తి తాజాగా 4 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. సాగర్ కు వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు విడుదల చేయడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలారు. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధానంగా విజయవాడలోని కృష్ణలంక, రామలింగేశ్వర్ నగర్ వాసులు వరదలో చిక్కుకున్నారు. 50 వేల ఇళ్లు నీట మునిగాయి. దీంతో బాధితులను సమీపంలోని ఇందిరాగాంధీ స్టేడియంతోపాటు, ప్రభుత్వ కళాశాలకు, పాఠశాలకు తరలించారు. రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో వరద ముంపును అడ్డుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించారు.రూ.100 కోట్లు ఖర్చు చేశారు. మరికొన్ని పనులు మిగిలిపోయాయి. ప్రభుత్వం మారిన తరవాత రక్షణ గోడ నిర్మాణ పనులు గాలికి వదిలేయడంతో 2 లక్షల మంది వరద భారినపడ్డారని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు విమర్శించారు.
కృష్ణా నది వరదలతో దివిసీమ లంక గ్రామలు నీట ముగిగాయి. 60 వేల ఎకరాల పంట నీట మునిగింది. 60 లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే వర్షాలు తగ్గుముఖం పటడ్డంతో మరో నాలుగు రోజుల్లో వరద తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరో నాలుగు రోజులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు.
అయితే రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.