కరోనా కారణంగా జనాలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడమే కాకుండా, ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ కు బదులుగా సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఎన్నోరకాల వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.
ఇంటి ఫుడ్ బెస్ట్
ఉద్యోగులు, విద్యార్థులు, వర్కర్స్ … ఇలా చాలామంది స్వయంగా వండుకోలేని పరిస్థితి. కరోనా వైరస్ రాకముందు వరకూ ఏదో తిన్నాం…అన్నట్టుగా ఆహార పద్ధతులను పాటించేవాళ్లు చాలామంది. ఇక నుంచి ఆ అలవాట్లు మానుకోవడం మంచిదంటున్నారు డాక్టర్లు. వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది కాబట్టి, పోషకాహారాన్ని తీసుకోవాలి. తద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇంట్లో వండుకునే ఆహారం తీనేందుకు ఇష్టం చూపాలి. బలమైన ఫుడ్ తీసుకోవడం వల్ల, కరోనా వచ్చినా.. త్వరగా కోలుకోవచ్చు. ఆహార నియమాలు మార్చుకుంటే కరోనా నుంచి వీలైనంత త్వరగా బయటపడొచ్చు.
పోషకాలు, విటమిన్లు తప్పనిసరి
మనం రోజువారి తినే ఆహారంలో విటమిన్లు, పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, నిమ్మ, ఉసిరి వంటి వాటి ద్వారా ‘విటమిన్ ఏ, విటమిన్ సి’, నువ్వులు, గుడ్లు, చికెన్, మటన్ వల్ల ‘విటమిన్ డి’తోపాటు, ప్రొటీన్లు, పీతలు, రొయ్యలు, చేపలు వంటి వాటి ద్వారా అన్ని రకాల పోషకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు. గుడ్లు, చికెన్, డ్రై ఫ్రూట్స్ వంటివి రోజూ తింటుంటే, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
పండ్లు, తగినంత నిద్ర
రోగ నిరోధక శక్తి పెంచడంలో పండ్లు బాగా పనిచేస్తాయి. అందుకే క్రమం తప్పకుండా పండ్లు తింటుండాలి. అంతేకాకుండా… అన్నిరకాల కూరగాయలు తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో కొన్ని విటమిన్లు కీలకంగా ఉంటాయి. ఆ విటమిన్లు లభించే ఆహారం రోజువారీ డైట్‌లో వుండేలా చూసుకోవాలి.
అతి వద్దు.. మితమే ముద్దు
ఈ రోజుల్లో చాలామంది అతిగా తింటుంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. అతిగా తినడం వల్ల నిరోధక శక్తి పెరగడం మాట అటుంచితే, లేనిపోని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్క రోజులోనో, నెలలోనో అయ్యే పని కాదని, రోజువారిగా జరగాల్సిన ప్రక్రియ అన్నారు. చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మాంసాహారం, డ్రైప్రూట్స్ తినడం వల్ల కొలెస్ర్టాల్ పెరిగి గుండె సంబంధిత సమస్యలు వేధించే ప్రమాదం ఉంది. కాబట్టి అతిగా తినకుండా ఉండాలి.
జాగ్రత్తలు ముఖ్యమే..
- ప్రస్తుతానికి కొన్ని రోజులు కరచాలనం చేయకపోవడమే మంచిది. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ‘నమస్తే’ అంటూ చేతులు జోడించడం మేలు.
- చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు, కళ్లను, ముక్కును నులుముకోవద్దు. మాస్కులు ధరించాలి.
- ఈ విషయాలను ఎవరికివారుగా ఇతరులకు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలి. వేడి చేసే ఆహారాన్ని తక్కువగా తీసుకుంటూ… బ్యాలెన్స్ చేసుకుంటే… కరోనా వైరస్ తోకముడుస్తుంది.