నేచురల్ స్టార్ నానీ తాజా చిత్రం ‘వి’. దిల్ రాజు నిర్మాణంలో, ఇంద్ర గంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ.. లాక్ డౌన్ కు ముందే పూర్తయిపోయింది. ఉగాది కానుకగా మార్చ్ 25 విడుదల కావాల్సిన ఈ మూవీ.. కరోనా వైరస్ కారణంగా విడుదల వాయిదా వేసుకుంది. అయితే ఇంకా థియేటర్స్ తెరవకపోవడంతో.. సెప్టెంబర్ 5న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
నానీ నటించిన ‘జెంటిల్ మేన్’ తరహాలోనే ఇంటెలిజెంట్ స్ర్కీన్ ప్లే తో ‘వి’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. కాకపోతే ఇది రివెంజ్ స్టోరీ. ఇందులో నానీ నెగెటివ్ షేడ్స్ తో కూడిన ఓ వైవిధ్యమైన పాత్రను పోషించాడు. సుధీర్ బాబు పోలీసాఫీసర్ గా నటించాడు. అదితీరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా స్టోరీ లైన్ కి, గతంలో సుమన్ నటించిన ‘న్యాయం మీరేచెప్పాలి’ స్టోరీ లైన్ కు దగ్గర పోలికలున్నట్టు తెలుస్తోంది. సుమన్, రజనీకాంత్, జయసుధ, సంయుక్త నటించిన ఆ సూపర్ హిట్ సినిమాకు దర్శకుడు జి.రామ్మోహనరావు . నిజానికి ఈ సినిమా ‘ఆజ్ కీ ఆవాజ్’ హిందీ సినిమాకి రీమేక్ వెర్షన్.
ఇదే సినిమా.. ఆ తర్వాత తమిళంలో రజినీకాంత్ హీరోగా ‘నాన్ సిగప్పు మణిదన్’ గా విడుదలై సూపర్ హిట్టైంది. కాలేజ్ లెక్చరర్ అయిన సుమన్ చెల్లెలిని కొందరు మానభంగం చేసి చంపేస్తారు. దాంతో రాబిన్ హుడ్ పేరుతో రాత్రి సమయంలో గూండాల్ని, సంఘవిద్రోహ శక్తుల్ని వరుసగా చంపేస్తూ ఉంటాడు. ఈ కేసును పరిష్కరించడానికి సిబిఐ ఆఫీసర్ రజనీకాంత్ రంగంలోకి దిగుతాడు. సరిగ్గా ఇదే స్టోరీ లైన్ తోనే ‘వి’ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది.
నానీ భార్య అదితీరావు హైదరిని కొందరు చంపేస్తారు. దాంతో నానీ ఆమెను చంపినవారిని వరుసగా చంపేస్తూ.. వారి డెడ్ బాడీల మీద ‘వి’ అనే అక్షరాన్ని ఉంచుతాడట. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ సుధీర్ బాబు రంగంలోకి దిగుతాడట. వీరిద్దరి మధ్య వచ్చే హైడ్ అండ్ సీక్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని ఫిల్మ్ నగర్ టాక్. మరి నానీ .. పెర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి. ఇది నిజంగా ఆ స్టోరీ లైనా కాదా అన్నది సినిమా చూస్తే గాని చెప్పలేం.