సోషల్ మీడియా మారుమూల గ్రామాలకు, కనీస అక్షర జ్ఞానం మాత్రమే ఉన్నవారికి కూడా ఎంతో అందుబాటులోకి వచ్చేసిన తర్వాత.. అందులో విశృంఖలత కూడా పెరిగిపోయింది.
సోషల్ మీడియా తరచూ వెర్రితలలు వేస్తుంటుంది. పోస్టులు వేలం వెర్రిగా మారడం దగ్గరినుంచి అప్ గ్రేడ్ అయి విశృంఖలంగానూ చెలామణీ అవుతున్నాయి. నెటిజన్లు అందరూ చదువుకున్న వాళ్లు, చదువుసంధ్యలు ఉన్నవాళ్లు మాత్రమే సోసల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండగలరు.. అనే అభిప్రాయం ఇదివరలో ఉండేది. ఇప్పుడు అది కూడా చెరిగిపోయింది. ఎందుకంటే.. స్మార్ట్ ఫోన్లు నిరక్షరాస్యుల చేతికి కూడా వచ్చేసిన తర్వాత.. వాట్సప్ లో ఒక బొమ్మ కనిపిస్తే చాలు.. తమ పార్టీ అభిమానాన్ని బట్టి రంగులు ఆ బొమ్మలో కనిపిస్తే చాలు.. దానిని వెంటనే తమకు తెలిసిన వాళ్లందరికీ ఫార్వర్డ్ చేసేయడం చాలా సులువు అయిపోతోంది.
చదువుకున్న వాళ్లే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండడం కొత్త సంగతి కాదు గానీ.. అలా చదువుకున్న వాళ్లకి ఈ రోజుల్లో పార్టీ దురభిమానాలు, కులం పిచ్చి తలకెక్కడమూ కాస్త శృతి మించి ఉండడమే అనేక వికృతపోకడలకు దారితీస్తోంది.
సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్లు ఎడాపెడా తమ అభిప్రాయం చెప్పేసుకునే వెసులు బాటు ఉన్నది గనుక.. తమకు తోచిన రీతిలో చెప్పేసుకోవడం వచ్చేస్తోంది. ఆ చెప్పుకోవడంలో కులం పిచ్చి, పార్టీ పిచ్చి విశృంఖలంగా వెల్లువెత్తుతున్నాయి. తాము అభిమానించే పార్టీలు కులాలను నెత్తిన పెట్టుకోవడం ఒక ఎత్తు. వ్యతిరేకించే కేటగిరీ కింద కొన్ని పార్టీలను, కులాలను లక్ష్యంగా చేసుకుని.. వారిమీద సోషల్ మీడియా నిండా విషం చిమ్మడం మరో ఎత్తు. ఈ రెండో రకం పోకడలు అనేక దారుణాలకు దారితీస్తున్నాయి. చదువుకున్నవాళ్లు అనే ఒకే ఒక అభిప్రాయం మనకు ఉంటుంది గానీ.. వాస్తవంలో చదువులేని వాళ్లకంటె దిగజారుడు వ్యక్తిత్వంతో, కుసంస్కారంతో అనేకానేక సోషల్ మీడియా పోస్టులు సమాజాన్ని మహమ్మారిలా ముంచెత్తుతున్నాయి.
కులాలను ఉద్దేశించి, తమకు కిట్టని నాయకుల్ని ఉద్దేశించి చాలా దారుణమైన భాషలో తిట్టిపోసేవారు సోషల్ మీడియాలో ఎక్కువయ్యారు. అడ్డూ అదుపూ ఉండడం లేదు.
చట్టాలు కూడా మారుతున్నాయి..
సోషల్ మీడియా వేదికలమీద అభిప్రాయాలు పంచుకునే ముసుగులో, వాక్ స్వాతంత్ర హక్కు ముసుగులో అత్యంత హేయంగా తమ అభిప్రాయాలు చెప్పే వాళ్లు పెరుగుతున్నట్టుగానే.. అలాంటి పోకడలకు కత్తెర వేయడానికి చట్టాలు కూడా కొత్తవి రూపు దిద్దుకున్నాయి. అరెస్టులు కూడా బాగా పెరుగుతున్నాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సోషల్ మీడియా వైపరీత్యపు పోకడలకు అడ్డుకట్ట వేయడానికి అనేక చట్టాలు వచ్చాయి. అవి ఇప్పుడు మరింత ఉధృతంగా అమలు అవుతున్నాయి.
ఫేస్ బుక్, ఇన్‌స్టా, ట్విటర్ లాంటి వేదికలమీద ఎలాంటి ఆకతాయి పోస్టులు పెట్టినా.. వెంటనే కేసులు నమోదు అవుతున్నాయి. బాధ్యులు ఎవరో, వాటిలో నేరం ఎంత ఉన్నదో.. ఆ సంగతంతా తరువాత.. ముందైతే అరెస్టులు జరిగిపోతున్నాయి. ఆ తర్వాత నెమ్మదిగా విడుదల చేస్తున్నారు. ఇలాంటి అరెస్టులు కూడా పెరిగాయి. నీచమైన భాషలో ఆన్ లైన్లో రాజకీయ, కులపరమైన పోస్టులు పెట్టే వారికి చిన్న భయం కూడా మొదలైంది.
ప్రత్యామ్నాయం వెతికారు..
ఇలాంటి చట్టాలకు దొరక్కుండా ఆకతాయిలు కొత్త మార్గం కనుక్కొన్నరు. అంతే తప్ప నీచమైన భాషలో తిట్టుకోవడం మాత్రం మానలేదు. ఇంతకీ సదరు కొత్త మార్గం ఏంటో తెలుసా? వాట్సప్!
అవును సాంకేతిక కారణాల గురించి మనకు తెలియదు గానీ.. ఘోరంగా ఉన్న మెసేజీలు ఎఫ్‌బీ, ట్విటర్ లో కాకుండా వాట్సప్ లో మాత్రం ఇప్పటికీ ఎప్పటిలాగానే ప్రత్యక్షం అవుతున్నాయి. ప్రత్యేకించి… పార్టీ నాయకుల పేరిట ఏర్పాటు అయ్యే వాట్సప్ గ్రూపుల్లో, కులాల పేరిట ఏర్పాటు అయ్యే వాట్సప్ గ్రూపుల్లో ఇలాంటి దరిద్రాలు అనేకం కనిపిస్తుంటాయి.
ఇలాంటి చెత్తను వ్యాప్తిలో పెడుతున్న వారు.. ప్రత్యేకించి ఒక నోట్ కూడా తగిలిస్తున్నారు. ‘‘ఈ పోస్టు వాట్సప్ లో మాత్రమే ఫార్వర్డ్ చేయండి. ఎఫ్బీలో పెట్టవద్దు’’ అని సూచిస్తున్నారు.
చూడబోతే వాట్సప్ లో మాత్రం.. కేసులు పెట్టడానికి తగినంతగా, బాధ్యుల్ని పట్టుకునే అవకాశం లేదేమో అనిపిస్తోంది.
వాట్సప్ లో నిబంధనలూ పుష్కలం
అసభ్యమైన పోస్టులు వాట్సప్ గ్రూపులలో సర్కులేట్ అయితే గనుక.. ఎడ్మిన్ లను బాధ్యులు చేసేలా నిబంధనలు ఉన్నాయి. గతంలో కొన్ని కేసుల్లో కోర్టులు కూడా ఇలాంటి తీర్పులు ఇచ్చాయి. అయితే.. ఇలాంటి పోస్టులు వెల్లువలా సర్కులేట్ అవుతోంటే కేవలం ఎడ్మిన్ లు మాత్రం ఏం చేయగలరు? పోస్టు వచ్చిన తర్వాత.. సదరు వ్యక్తిని గ్రూపను నుంచి రిమూవ్ చేసి.. అంతకంటె తాము చేయగలిగింది ఏమీ లేదని వారు చేతులు దులుపుకోగలరు! కానీ సమస్యకు అది పరిష్కారం కాదు.
ఇలాంటి అసభ్య పోస్టులు పెట్టిన వారిని వాట్సప్ లో అయినా సరే.. ట్రేస్ చేసి పట్టుకునే ఏర్పాట్లు ఉండాలి. పోస్టులు ఫార్వర్డ్ చేసేవారితో పాటు, అసలు అలాంటి పోస్ట్ మూలస్థానం ఎక్కడ ఉన్నదో కనిపెట్టే వెసులుబాటు కూడా రావాలి. ఒక పోస్టు ఫార్వర్డ్ అయినప్పుడు.. దాని డీటెయిల్స్ కోసం వెతికితే గనుక.. మొట్టమొదటగా ఆ పోస్టును ఎవరు పెట్టారో.. ఆ తర్వాత ఎవరెవరు ఎలా ఫార్వర్డ్ చేశారో కూడా ఎలాంటి ప్రయాస లేకుండా కనిపించే వెసులుబాటు హిడెన్ సెటింగ్స్ రూపంలో ఉంటే గనుక.. చాలా వరకు ఇలాంటి వైపరీత్యాలను అరికట్టవచ్చు.
వాట్సప్ ద్వారా.. లేదా మరో ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా.. ఎవరికీ దొరక్కుండా విష ప్రచారాన్ని కొనసాగించవచ్చు.. అనే అభిప్రాయం ఎవరికైనా ఉంటే గనుక.. అలాంటి వారు రెచ్చిపోతుంటే గనుక.. వారికి బుద్ధి చెప్పే ఏర్పాటు చాలా అవసరం.











