‘ముల్లు పోయి కత్తి వచ్చే’ కథ మాదిరిగానే ఉంది సుశాంత్ సింగ్ కేసు పురోగతి. ఈ కేసు దర్యప్తు సీబీఐకి ఇచ్చినా చివరికి అది డ్రగ్స్ కేసు రూపంలోకి మారిపోయింది. అందరూ సుశాంత్ మరణాన్ని మరచిపోయి డ్రగ్స్ కేసులో ఎవరెవరు బయటకు వస్తారా అని ఆత్రంగా ఎదురు చూశారు. సుశాంత్ కేసులో రీపోస్టుమార్టమ్ కూడా తప్పనిసరి అయ్యింది. అలా అది ఎయిమ్స్ కు చేరింది. సుశాంత్ ది హత్య కాదు ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం తేల్చింది. ఆ నివేదికను కూడా సీబీఐకి అందజేసింది.
అంతా బాగానే ఉందికానీ మళ్లీ ఇక్కడ ఓ ట్విస్ట్ వచ్చేసింది. సుశాంత్ ది ఆత్మహత్య కాదు అది హత్యేనంటూ ఎయిమ్స్ డాక్టర్ ఆడియో లీక్ ఒకటి సంచలనం కలిగిస్తోంది. దాంతో మళ్లీ కథ మొదటికి వచ్చినట్లయింది. అతను ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడని ఎయిమ్స్ అధికారులు అందజేసిన నివేదికకూ, ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆడియోకూ లింక్ కుదరడం లేదు. సుధీర్ గుప్తా ఆడియో పేరుతో చలామణి అవుతున్న దాంట్లో చాలా సంచలన కామెంట్లు ఉన్నాయి. ఈ కేసులో ఫోరెన్సిక్ విభాగం ఓ స్పష్టత ఇచ్చింది.
సుశాంత్ ఒంటి మీద గాయాలు లాంటివి ఏమీ లేవని, ఎలాంటి అనుమానాస్పద గుర్తులు లేవని అందులో పేర్కొన్నారు. ఈ రిపోర్ట్ తయారు చేసిన బృందానికి హెడ్ ఎవరో కాదు ఈ సుధీర్ గుప్తానే. ఇది 200 శాతం హత్యేనని, ఆ ఫొటోలు చూస్తుంటేనే అర్థమవుతోందని ఆయన అంటున్నారు. సుశాంత్ సింగ్ కుటుంబానికి చెందిన న్యాయవాది వికాస్ సింగ్ కూడా ఈ ఫోరెన్సిక్ నివేదికను మరోసారి పరిశీలించాలని కోరుతున్నారు. మరో కొత్త ఫోరెన్సిక్ టీమ్ ను ఏర్పాటుచేయాలని సీబీఐని కోరారు. మొదటి పోస్టుమార్టం కూపర్ హాస్పటల్ చేసింది.
డెడ్ బాడీ లేనప్పుడు ఎవరో చేసిన పోస్టుమార్టం మీద ఎయిమ్స్ అధికారులు ఎలా రిపోర్టు ఇస్తారని న్యాయవాది ప్రశ్నిస్తున్నారు. సుశాంత్ కనీసం ఏ టైమ్ లో చనిపోయాడో కూడా కూపర్ ఆస్పత్రి చెప్పలేదని ఆరోపించారు. ఎయిమ్స్ రిపోర్టు ప్రకారం అతని ప్రియురాలు రియా చక్రవర్తి అతన్ని మానసికంగా వేధించిందనే కోణంలోనే కేసు సాగుతోంది. రియా ఈ కేసు నుంచి బయటపడాలంటే ముందు కుట్రకోణం బయటికి రావాలి. ఒకవేళ అందులో కూడా రియా పాత్ర ఉంటే ఆమె పూర్తిగా ఈ కేసులో కూరుకుపోయినట్లే. ఈ కేసును ఏ సెక్షన్ కింద మారుస్తారనేది ఇప్పుడే చెప్పలేం. ఇంకా సీబీఐ దర్యప్తు సాగుతూనే ఉంది.











