ఆ సీనియర్ నేత రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగారు. అయితే ఇప్పుడు సొంత పార్టీలోనే ఆయనకు ప్రాధాన్యత దక్కడం లేదట. అందుకే ఇంతకాలం అలకపాన్పు ఎక్కి ఎవరినీ పట్టించుకోవడం లేదట.అయితే ఇప్పుడు రూట్ మార్చి తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారట. తమ నాయకుడు ఏం చేస్తున్నారో అర్ధంకాక పెద్దాయన వైరాగ్యం తమ పాలిట దౌర్భాగ్యంగా మారిందంటూ క్యాడర్ తలలు పట్టుకుంటున్నారట. తనకు గౌరవం దక్కని చోట తానేందుకు ఉండాలి అనే భావనలో ఉన్న ఆ మాజీమంత్రి ఎవరు ?అధికార పార్టీలో అలజడి సృష్టించేలా ఆయన చేస్తున్న ఆలోచనలు ఏమిటి ?
ధర్మాన ప్రసాదరావు ! రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. నాటి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మొదలు కిరణ్ కుమార్ రెడ్డి వరకు అనేక మంది ముఖ్యమంత్రుల క్యాబినెట్ లో మంత్రిగా పని చేసి ఓ వెలుగు వెలిగిన నేత. సుధీర్గ కాలంపాటు కాంగ్రెస్ లో కొనసాగిన ధర్మాన రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో వైసీపీలో చేరారు.ఇక 2019 ఎన్నికల్లో ధర్మాన వైకాపా అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు.అయితే సుధీర్గ రాజకీయ అనుభవం కలిగిన ధర్మానకు ఇప్పుడు సొంత పార్టీలోనే గుర్తింపు లభించడం లేదట. దీంతో ధర్మాన రాజకీయ వైరాగ్యంలోకి జారిపోతున్నారనే చర్చ రాజకీయ వర్గాలలో జోరందుకుంది.
నిజానికి రాష్ట్రంలో వైసీపీ ఏర్పాడ్డాక తొలి క్యాబినెట్ లో సీనియర్ కాబట్టి ప్రసాధరావుకే మంత్రి పీఠం దక్కుతుందని అంతా ఆశించారట. కానీ జగన్ వ్యూహాత్మకంగా విధేయత పేరుతో కృష్ణదాసుకు మంత్రి పదవి కట్టబెట్టారు.దీంతో కొంతకాలం పాటు ధర్మాన అలకపాన్పు ఎక్కారట.అంతేకాకుండా నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు ధర్మాన దూరంగానే ఉంటూ వచ్చారట. మంత్రి పదవి దక్కకలేదన్న అసంతృప్తి కారణంగానే ధర్మాన బయటకు రావడం లేదనే చర్చ ఆయన అనుచరుల్లో కూడా జరిగిందట.
ఇక ఉపముఖ్యమంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మరొమాంత్రి మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన రెండింటిలో ఒక మంత్రి పదవి దక్కుతుందని ధర్మాన ఆశించారట. అదేసమయంలో ధర్మానఈసారి ఖచ్చితంగా మంత్రి కాబోతున్నారు అంటూ ఆయన అనుచరగణం కూడా గట్టిగానే ప్రచారం చేసుకుందట. అయితే సామాజికవర్గ సమీకరణాల పేరుతో అప్పుడు కూడా ధర్మానకు సిఎం జగన్ మొండిచేయి చూపించారట.ఈ నేపధ్యంలో ధర్మాన ప్రసాదరావు మళ్ళీ సైలెంట్ అయిపోయారట.ఇక నియోజకవర్గ వ్యవహారాల్లోనూ ధర్మాన అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తుండడంతో క్యాడర్ కు ఏం చేయాలో పాలుపోవడంలేదట. కేవలం మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితోనే ధర్మాన సైలెంట్ అయిపోయారని, తమకీ మంచి రోజులు వస్తాయలే అని కార్యకర్తలు సర్దుకుపోయారట.
వాస్తవానికి వైసీపీలోకి వచ్చిన తొలినాళ్ళల్లో జిల్లా పార్టీ వ్యవహారాలను ధర్మాన అన్నీ తానై చూసుకున్నారట. ఇక జిల్లా పార్టీ కార్యాలయాన్ని సైతం తన ఆధీనంలో ఉన్న టౌన్ హాల్ కు తరలించి అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలు అన్నీ నిర్వహించే వారట. అయితే ఏడాది క్రితం పార్టీ కార్యాలయం మరొక చోటికి మార్చారు. అప్పటి నుంచి ధర్మాన పార్టీ కార్యాలయానికి కూడా దూరంగానే ఉంటున్నారట. తన కార్యకర్తలను , అనుచరులను ఇంటికే వచ్చి కలవాలని చెబుతున్నారట.ఇవే అంశాలు వైసీపీ పై ధర్మానలో నెలకొన్న అసంతృప్తిని స్పష్టం చేస్తోందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోందట.
ఇదిలా ఉంటే సీనియర్ నేతగా ఉన్నప్పటికీ పార్టీలో తన మాట చెల్లుబాటు కావడం లేదని ధర్మాన లోలోపల రగిలి పోతున్నారట. మంత్రి పదవి ఎలాగూ రాలేదు, కనీసం తన సీనియారిటీకి తగిన గుర్తింపు కూడా ఇవ్వడం లేదని తన అనువాయుల వద్ద ఆవేదన వెళ్లగక్కుకున్నారట.ఈ క్రమంలోనే ప్రసాదరావు గేర్ మార్చి తనదైన రాజకీయానికి తెరలేపారనే చర్చ జిల్లా వైసీపీ వర్గాలలో జోరందుకుంది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనాలు వంటి కార్యక్రమాలకు హాజరైన క్రమంలో ధర్మాన చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయనే వాదన బలంగా జరుగుతోంది. ఒకవైపు ప్రభుత్వాన్ని పొగుడుతూనే మరోవైపు నుంచి ప్రభుత్వం పై ఆయన వేస్తున్న పంచ్ లు జగన్ సర్కార్ ను ఇరుకున పెట్టేవిగా ఉంటున్నాయని సొంత పార్టీ నేతలె చర్చించుకుంటున్నారట.
మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గంలో తన మార్క్ అభివృద్ధి పనులను చూపించిన ధర్మాన.. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా మూడేళ్ళలో చెప్పుకోతగ్గా పనిఒక్కటీ చేయలేకపోయాననే భావనలో ఉన్నారట. దీంతో పార్టీలో అడుగడుగునా తనకు జరుగుతున్న అవమాణాలకు రగిలిపోతున్నారని ఆయన ఆంతరంగీకులు చర్చించుకుంటున్నారట. ఈ నేపధ్యంలోనే వైసీపీలో తన మనుగడ కష్టమే అనే ఆలోచనలో ధర్మాన ఉన్నారని ఆయన అనుచర గణం చెవులు కోరుక్కుంటున్నారట.
మొత్తానికి సొంత పార్టీ పై అసంతృప్తితో ఉన్న ధర్మాన రాజకీయ ప్రయాణం ఎటువైపుగా సాగుతుందో తెలియాలంటే మరికొద్ది కాలం వేచి చూడక తప్పదు.