నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక శుక్రవారం జరిగింది. కట్టుదిట్టమైన భద్రతానడుమ పోలింగ్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఉప ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వి.సుభాష్‌రెడ్డి, తెరాస నుంచి కెసిఆర్ కూతురు, మాజీ ఎంపి కవిత, బిజెపి నుంచి లక్ష్మీనారాయణ ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. అయితే ఎన్నికల పోలింగ్ సరళిని చూస్తే ఎమ్మెల్సీగా కవిత విజయం దాదాపు ఖాయమైనట్లేనని టిఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.
అప్పుడే గెలుపు సంబురాలు..
భూపతి రెడ్డిపై అనర్హతవేటుతో నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. గతంలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి బిజెపి అభ్యర్థి డి.అరవింద్‌పై కవిత ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యం కావడంతో ఎమ్మెల్సీగా ఎన్నికల బరిలో నిలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలని కవిత భావించింది. ఇక్కడి నుంచి పోటీచేస్తే గెలుపు సునాయాసం అవుతుందని ఆమె అనుకొని ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన నిజామాబాద్ ఉపఎన్నిక శుక్రవారం జరగింది. ఈ ఉపఎన్నికలో 99.64 శాతం పోలింగ్ నమోదైంది. స్థానికసంస్థల కింద జడ్పిటిసిలు, కౌన్సిలర్లు, ఎంపిటీసిలు, కో ఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు ఓటు హక్కును ఇందులో కలిగి ఉన్నారు. మొత్తం 824 ఓట్లు ఉంటే తెరాసకు 570 ఓట్లు, బిజెపికి 78, కాంగ్రెస్‌కు 152, ఎంఐఎం, ఇండిపెండెంట్‌లు 28 వరకు ఓట్లు ఉన్నాయి. ఇందులో మూడవ వంతు కంటే ఎక్కువ ఓట్లు కవితకే పడినట్లు పార్టీ నేతలు లెక్కలు వేసుకుని సంబరురాలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.
80 శాతం ఓట్లు..
అయితే ఈ 824 ఓట్లలో దాదాపు టిఆర్ఎస్‌కు చెందిన 570 ఓట్లు, ఎంఐఎం, స్వతంత్రుల 28 ఓట్లు ఎలాగో కవితకే పడతాయి. ఇక కాంగ్రెస్, బిజెపి పార్టీకి చెందిన ఓట్లల్లో సగం ఓట్లు కూడా కవితకే పడ్డాయని అంచనాలు వేసుకుంటున్నారు. ఇలా మొత్తంగా 650 నుంచి 700 వరకు ఓట్లు కవితకు పోలైనట్లు తెరాస శ్రేణులు అంచనాకి వస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ కంటే తమకే ఎక్కువ ఓట్లు ఉన్నాయని, ఇలా లెక్కలు వేసుకొని ఎన్నికల ఫలితాలకంటే ముందే పార్టీ శ్రేణులు గెలుపు సంబురాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా12వ తేదీన ఈ ఫలితాలు వెలువడనున్నాయి. అయితే తొలి రెండు రౌండ్లోనే అభ్యర్థి గెలుపు ఖాయమయ్యే అవకాశం కనబడుతోంది. ఈనేపథ్యంలో ఫలితాలు వెలువడిన తరువాత ర్యాలీలు, సంబురాలు జరుపుకోవడంపై తెరాస శ్రేణులు ఇప్పటి నుంచే ప్లాన్‌లు వేసుకుంటున్నారట.
50 పోలింగ్ కేంద్రాలు..
కరోనా నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 50 వరకు పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో 6 వరకు మాత్రమే ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈసారి ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యల్పంగా చందూర్‌లో నాలుగు ఓట్లు ఉంటే, నిజామాబాద్ కార్పోరేషన్‌లో అత్యధికంగా 67 ఓట్లు ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్‌లలో వెబ్‌కాస్టింగ్, వీడియో షూటింగ్‌కు ఏర్పాటు చేసి అధికారులు ఎన్నికలు నిర్వహించారు. కాగా, టిఆర్ఎస్ అభ్యర్థి కవితకు ఎనభైశాతం ఓట్లు పోలైనట్లు పార్టీ నేతలు అంచనా వేసుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తునారు.











