భావప్రకటన స్వేచ్ఛ గురించి పాఠం చెప్పడంలో భాగంగా.. మహ్మద్ ప్రవక్త మీద గీసిన ఒక కేరికేచర్ ను తరగతి గదిలో చూపించడం ఒక టీచరు ప్రాణం తీసింది. విస్తుగొలిపే ఈ దుర్ఘటన పారిస్ లో జరిగింది. ఇలాంటి పని ద్వారా తమ మనోభావాలను గాయపరిచారనే ఉద్దేశంతో ఒక విద్యార్థి తండ్రి, పారిస్ నగర శివార్లలో సదరు టీచరు తలనరికి చంపేశాడు. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనాన్ని అందించింది.
వివరాలు ఇలా ఉన్నాయి.
మిడిల్ స్కూలు టీచరు తన సివిక్స్ క్లాసులో భావప్రకటన స్వేచ్ఛ గురించి పాఠం చెబుతూ.. తరగతి గదిలో ముస్లిం పిల్లలు ఎవరైనా ఉంటే చెయ్యెత్తాలని అన్నారు. ఆ వెంటనే వారిని తరగతి గదిలోంచి బయటకు వెళ్లమని చెప్పారు. మహ్మద్ ప్రవక్త మీద గీసిన ఒక కేరికేచర్ చూపించడానికే అలా చేశారు. ఆ చిత్రం చూస్తే వారు బాధపడతారనే ఉద్దేశంతో గదిలోంచి బయటకు పంపారు. ముస్లిం పిల్లలు బాధపడకూడదనే ఉద్దేశంతోనే ఆ టీచరు ఇలా చేసినట్లుగా ఒక విద్యార్థి తండ్రి చౌహాది రాయిటర్స్ తో చెప్పారు.
అయితే కొందరు తల్లిదండ్రులకు మాత్రం ఈ చర్య కోపం తెప్పించింది. రెండు మూడు రోజుల తర్వాత.. స్కూలుకు వెళ్లి.. యాజమాన్యంతోను, ఆ టీచరుతోను వారు ఈ విషయంపై మాట్లాడారు.
ఆ సమావేశం మామూలుగానే జరిగింది గానీ.. ఆ తరువాత.. పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరు టీచరుపై దాడిచేసి కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను కూడా మరణించాడు.
ఈ ఘటన పారిస్ లో సంచలనం సృష్టిస్తోంది.











