దాదాపు నాలుగు దశాబ్ధాలుగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు లేవు. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక, హార్స్ పవర్ కు రూ.50 శ్లాబు విధానం అమల్లోకి తీసుకువచ్చారు. 2004 వరకు అదే విధానం అమల్లోకి వచ్చింది. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్ అమల్లోకి వచ్చింది. దీంతో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే అవసరం లేకుండా పోయింది. తాజాగా ఏపీ ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించింది. ఎఫ్ ఆర్బీ ఎం లిమిట్ అంటే ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకునే అర్హతను 5 శాతానికి పెంచుకునేందుకు కేంద్రం విధించిన నిబంధనలను పూర్తి చేయడంలో భాగంగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించారు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మీటరు బిగించుకుంటేనే ఉచిత విద్యుత్, లేదంటే ఉచిత విద్యుత్ నిలిపివేస్తామని విద్యుత్ శాఖ తాజా ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నారు. అంటే రైతులకు ఇష్టం లేకపోయినా బెదిరించి అయినా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మోటార్లు బిగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
శ్రీకాకుళం నుంచి ప్రారంభం
ఏపీలో అతి తక్కువ వ్యవసాయ పంపుసెట్లు అంటే కేవలం 37 వేలు మాత్రమే ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి మీటర్లు బిగించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఢిల్లీ పరిసర ప్రాంతాల పరిశ్రమల నుంచి మీటర్లు రావడం ఆలస్యం అయింది. దీంతో ఇప్పటి వరకూ ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఎప్పటికప్పుడు విద్యుత్ వాడకంపై పంపిణీ సంస్థకు సమాచారం అందుతుంది. ప్రతి నెలా బిల్లు తీసే ప్రక్రియ సులువవుతుంది. అయితే స్మార్ట్ మీటర్లు ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. అందుకే శ్రీకాకుళం జిల్లా వరకు మామాలు మీటర్లు బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతుల నుంచి అంగీకారపత్రాలు తప్పనిసరి
వ్యవసాయ పంపులు వాడుతున్న ప్రతి రైతు నుంచి రెండు అంగీకార పత్రాలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. మీటరు బిగించుకుంటేనే ఉచిత విద్యుత్ ఇస్తామని, ఇందుకు ఒప్పుకుంటూ ఒక అంగీకారపత్రం తీసుకుంటున్నారు.ఇక రైతు పేరుతో ప్రభుత్వమే బ్యాంకు ఖాతా ప్రారంభిస్తుంది. అందులో ప్రభుత్వం వేసే నిధులను, విద్యుత్ పంపిణీ సంస్థలు తీసుకునేందుకు రైతుల నుంచి మరో అంగీకారపత్రం తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను ఇప్పటికే 13 జిల్లాల్లో ప్రారంభించారు. దీంతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వ్యవసాయానికి విద్యుత్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఉద్యమానికి సిద్దం అవుతున్నాయి.
ఐటీ పేరుతో ఏరివేత
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ భారం నుంచి ప్రభుత్వం చిన్నగా తప్పుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రక్రియను శ్రీకాకుళం జిల్లాల్లో ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో 37 వేల మంది రైతులకు ఉచిత విద్యుత్ అందుతోంది. తాజాగా వీరిలో 6 వేల మంది రైతులు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారని గుర్తించారు. వారు ఉచిత విద్యుత్ పొందేందుకు అనర్హులుగా ప్రకటించారు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. శ్రీకాకుళం జిల్లాల్లో రైతుల బిడ్డలు ఉద్యోగాలు చేస్తూ ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేస్తే, వారికి కూడా ఉచిత విద్యుత్ నుంచి మినహాయించారు. ఇదే నిబంధన అన్నీ జిల్లాల్లో కూడా అమల్లోకి రానుంది. ఇదే జరిగితే… సగం మంది రైతులు ఉచిత విద్యుత్ కు దూరం కానున్నారనే భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై ప్రతిపక్షాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్దం అవుతున్నాయి. అందుకే ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ముందుగానే అంగీకారపత్రాలు తీసుకుంటోందని తెలుస్తోంది.