పాస్టర్లను ప్రభుత్వం జీతాలిస్తోంది.. మతమార్పిడులకు పాల్పడటానికా అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విశాఖలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హిందువుల దేవాలయాలపై దాడులు జరిగితే బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని, ఈ ప్రభుత్వం, డీజీపీ హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుందా? అని సోము అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం, రామతీర్థం ఘటన తరవాత బీజేపీ నేతలు అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కాదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. దేవాలయాలపై ఘటనల విషయంలో బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన డీజీపిని వెంటనే పదవి నుంచి తొలగించాలని సీఎంను సోము డిమాండ్ చేశారు.
దేవాలయాల ధ్వంసంలో కొన్ని రాజకీయ పార్టీల ప్రమేయం ఉందంటూ కొన్ని పార్టీల పేర్లను ఉచ్చరిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడంపై సోము వీర్రాజు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో చర్చిల ఆస్తులను గుర్తించి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాకినాడ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న బాలకార్మికుల కోసం విదేశాల నుంచి ఫండ్స్ సేకరించి, ఏపీ మతమార్పిడుల కోసం వినియోగిస్తున్నాడని, అతనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్టు సోము వీర్రాజు ప్రకటించారు. ప్రభుత్వ నిధులతో చర్చిలు నిర్మించడాన్ని ఆయన తప్పుపట్టారు.