ఏపీలో వ్యాపారులకు పెద్ద సమస్యే వచ్చి పడింది. అసలే కరోనాతో వ్యాపారాలు సరిగా లేక ఈగలు తోలుతుండే సీఎం జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల పేరుతో చిరు వ్యాపారుల నుంచి, బడా వ్యాపారుల వరకు జె టాక్స్ చెల్లించుకోవాల్సి రావడం వారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. రేపు సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జె టాక్స్ వసూలు చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎంకు లేఖ రాయడం సంచలనంగా మారింది. చిరు వ్యాపారుల నుంచి రూ.5 వేలు మొదలుకుని పెద్ద వ్యాపారాలు చేసే వారి నుంచి రూ.లక్ష రూపాయల వరకూ వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా జగనన్న జన్మదిన వేడుకల పేరు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రూ.1000 కోట్ల దాకా జె టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఏమిటీ దందా?
సీఎం జన్మదిన వేడుకల పేరుతో వైసీపీ గల్లీ నాయకుల నుంచి మంత్రుల దాకా జె టాక్స్ పేరుతో భారీగా దండుకుంటున్నారని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపిస్తున్నారు. సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించవద్దని ఎవరూ అనరు కానీ, ఆ పేరుతో వైసీపీ నాయకులు కోట్లాది రూపాయల జె టాక్స్ వసూళ్లకు పాల్పడుతూ పార్టీకి, సీఎంకు చెడ్డపేరు తీసుకువస్తున్నారని రఘురామరాజు వాపోయారు. ఇప్పటికైనా జె టాక్స్ వసూళ్లు నిలిపివేసేలా సీఎం వైసీపీ శ్రేణులను ఆదేశించాలని ఆయన విజ్ఙప్తి చేశారు. అయితే ఇవేవీ వైసీపీ నాయకులకు పట్టేట్టు లేవు. రేపు జరగనున్న సీఎం జన్మదిన వేడుకలను నాయకులు ఇప్పుడే ప్రారంభించారు. కాకినాడలో 60 అడుగుల సీఎం కటౌట్ ఏర్పాటు చేసిన వైసీపీ నాయకులు శనివారం నాడే భారీ క్రేన్లు తీసుకువచ్చి పాలాభిషేకం చేసి భారీ దండలు వేసి ముందస్తు వేడుకలు నిర్వహించారు. అందరితోపాటు జగనన్న జన్మదిన వేడుకలు నిర్వహిస్తే మీడియాలో కవరేజీ రాదనుకున్నారో ఏమో రెండు రోజుల ముందే అన్న జన్నదిన వేడుకలు నిర్వహించి వార్తల్లో నిలిచారు.
విజయసాయిరెడ్డి కొత్త పంథా..
సీఎం జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా విశాఖలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్టు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు. విశాఖలో భారీగా జె టాక్స్ వసూలు ప్రారంభించారని తెలుస్తోంది. క్రికెట్ టోర్నీ పేరుతో విశాఖలో రూ.100 కోట్ల జె టాక్స్ వసూళ్లుకు తెగబడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండే విశాఖను ఫ్యాక్షనిస్టులకు నిలయంగా మార్చారని, సందర్భం ఏదైనా జె టాక్స్ వసూళ్లు మాత్రం ఆపడం లేదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. సీఎం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా జన్మదినం పేరుతో ఇలా చిరు వ్యాపారులను సైతం వేధిస్తే పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయని ఆ పార్టీ నేతలే మధనపడుతున్నారు.
జగనన్న చేయూత
జగనన్న చేయూత పథకం ద్వారా చిరు వ్యాపారులకు కేవలం పది వేలు రుణ సదుపాయం కల్పించారు. కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం ఘనంగా ప్రారంభించారు. ఇంకా చాలా మంది చిరు వ్యాపారులకు బ్యాంకులు పది వేల రుణం కూడా ఇవ్వకముందే, జె టాక్స్ వసూళ్లను ప్రారంభించారని ఎంపీ రఘురామరాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చిరు వ్యాపారులకు ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదు. బ్యాంకుల ద్వారా పది వేలు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. అయినా వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. అసలు చిరు వ్యాపారులకు పదివేలు రుణం అందిందో లేదో కూడ తెలియకున్నా జగనన్న జన్మదిన వేడుకలు పేరుతో వారి వద్ద నుంచి జె టాక్స్ వసూళ్లకు పాల్పడంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
ఆయన జన్మదినం కొందరికి పండగే
జగనన్న జన్మదిన వేడుకల పేరుతో జె టాక్స్ వసూలు చేసుకునే అవకాశం దక్కిందని కొందరు వైసీపీ నేతలు సంబర పడుతున్నారు. ఒక్కో వ్యాపారి ఎంత చెల్లించాలో వైసీపీ నేతలే ఆదేశిస్తున్నారని తెలుస్తోంది. ఇలా నగరాల్లో కార్పొరేటర్ స్థాయి వైసీపీ నేత రూ.30 లక్షలదాకా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. అందులో రూ.5 లక్షలతో జగనన్న జన్మదిన వేడుకల హడావుడి చేసి, మిగిలింది స్వాహా చేసే ప్రణాళికతో కొందరు ముందుకు వెళుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలు, పన్నులు చెల్లించలేక జనం నానా అవస్థలు పడుతుంటే కొత్తగా జె టాక్స్ వసూలు చేయడంతో చిరు వ్యాపారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.