మహేశ్ బాబు అభిమానులందరి దృష్టి ఇప్పుడు ‘సర్కారువారి పాట’ సినిమాపైనే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాళ్లంతా ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, కొన్ని రోజులుగా దుబాయ్ లో షూటింగు జరుపుకుంటోంది. మహేశ్ బాబు తదితరులపై అక్కడ కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను రూపొందించారు. అక్కడి యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇందుకోసం భారీ మొత్తమే ఖర్చు చేశారట.
ప్రస్తుతం ఈ సినిమా అక్కడ మొదటి షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుందని అంటున్నారు. అయితే ఆ విషయాన్ని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించవలసి ఉంది. తరువాత షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ షెడ్యూల్లో ముఖ్యపాత్రధారులంతా పాల్గొననున్నారని అంటున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. కీర్తి సురేశ్ తొలిసారిగా మహేశ్ బాబుతో కలిసి నటిస్తుండటంతో, అందరిలోను ఆసక్తి రేకెత్తుతోంది.
మహేశ్ బాబు ఒక దర్శకుడికి అవకాశం ఇవ్వాలన్నా, ఒక కథను ఓకే చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచన చేస్తాడు. అలాంటి మహేశ్ బాబు .. ‘గీత గోవిందం’ చూసి పరశురామ్ కి అవకాశం ఇవ్వడం ఆశ్చర్యం. ఆ సినిమా మాదిరిగానే ఈ సినిమా కూడా నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా పరశురామ్ నడిపిస్తుండటం పట్ల ఆయన చాలా సంతృప్తిగా ఉన్నాడని అంటున్నారు. టైటిల్ కాస్త కొత్తగా ఉన్నప్పటికీ, కామెడీపాళ్లు ఎక్కువ కలిసిన కథగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది ‘సంక్రాంతి’ బరిలో ఈ సినిమాను నిలబెట్టాలనే ఆలోచన దిశగా షూటింగు సాగుతోంది.