గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ వైకాపా లోకి చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వై ఎస్ ఆర్ సి పి తీర్ధం పుచ్చుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ పరిణామంతో విశాఖలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
గంటా శ్రీనివాసరావు వైకాపాలో చేరకముందే.. అతని కొడుకును పార్టీలో చేర్చడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ వరవడిని కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రత్యక్షంగా తెలుగు దేశంలో కొనసాగుతున్న … పరోక్షంగా అధికార పార్టీకి మద్దతు పలుకుతూ.. వారసులకు మాత్రం ఆ పార్టీ తీర్థం ఇప్పిస్తున్నారు.
అభ్యంతరాలకు కాలం చెల్లింది
గంటా వైసీపీలో చేరడాన్ని స్థానిక పార్టీ నాయకులు మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గంటాను చేర్చుకోవడానికి మాత్రం వీల్లేదని ఆయన అడ్డం పడ్డారు. అలాగే విశాఖ కేంద్రంగా పార్టీ రాజకీయాలకు కేంద్రబిందువుగా ఉండే విజయసాయిరెడ్డి కూడా గంటా చేరికకు అడ్డు పడుతున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే వీరి అభ్యంతరాలను జగన్మోహన రెడ్డి సమర్థంగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.
గతంలోనే అవంతి శ్రీనివాస్ ను పిలిచి, గంటా విషయంలో ఊరుకోవాల్సిందిగా జగన్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. స్థానిక వైసీపీ వర్గాల్లో ఇతరులనుంచి కూడా అభ్యంతరాలు వచ్చినప్పటికీ.. జగన్ వాటిని అణిచేశారు. పార్టీ విస్తృతప్రయోజనాల దృష్ట్యా గంటా చేరికకు పచ్చజెండా ఊపారు. అందరి అభ్యంతరాలు మంటగలిసిపోగా.. చేరిక ముహూర్తం ఖరారైంది.










