తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈపేరు తెలియని వారు ఉండరు. రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఎప్పుడూ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండే నేత. ఈ కరోనా కాలంలోనూ మంత్రి తలసాని బిజీబిజీ షెడ్యూల్‌తో ముందుకు పోతున్నారు. రోజుకు మూడు ప్రారంభోత్సవాలు, ఆరు శంకుస్థాపనలు, సమావేశాలతో ప్రభుత్వ కార్యక్రమాలను హైదరాబాద్‌తోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లోనూ చేపడుతున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నా ఏ మంత్రి చేయని విధంగా పనుల పర్యవేక్షణ, సమీక్షలు, సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం నిజంగా అభినందించదగ్గ విషయమే.
కానీ మంత్రిగారూ ఒక విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నరో అందరికి అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. బహిరంగ కార్యక్రమాలు చేపట్టేటప్పుడు కొన్ని సందర్భాల్లో మూతికి మాస్కులేకుండా మంత్రి తలసాని దర్శనమిస్తున్నారు. అంటే తలసాని వ్యక్తిగతంగా తనవరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికిని తన పక్కవారితో కరోనా వైరస్ తన ద్వారా ఇతరులకు వ్యాపించే ప్రమాదం పొంచి ఉందనే విషయం మంత్రిగారూ ఎందుకు పట్టించుకోవట్లేదోననే చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలకు గానీ, ప్రభుత్వ కార్యక్రమాలకు గానీ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలు హాజరవుతుంటారు. నగరంలో కరోనా వ్యాప్తి ఇంకా తగ్గనూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి తలసాని ఇలా మూతికి మాస్కు లేకుండా కార్యక్రమాల్లో పాల్గొనడంపై మంత్రి తీరుపట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ధీమా ఉంటే మంచిదే?
సనత్ నగర్ లోని కంజర్ల లక్ష్మీనారాయణ పార్క్ వద్ద గ్రాడ్యుయేట్స్ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ప్రారంభించారు. అలాగే బుధవారం సికింద్రాబాద్ ఆర్‌డిఓ కార్యాలయంలో 157 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సమావేశాలకు సంబంధించిన ఫోటలను పరిశీలిస్తే అందులో ఆయన ఎక్కడా కూడా మాస్కు ధరించినట్లు మనకు కనిపించదు. అలాగే గతంలో పాల్గొన్న ఇతర కొన్ని కార్యక్రమాల్లోనూ మంత్రి తలసాని మాస్కు ధరించినట్లు మనకు కనబడిన దాఖలాలు దాదాపు లేవు. ఇలా మాస్కు లేకుండా మంత్రిగారూ బయట తిరగటం ఆయనకు, ప్రజలకు ప్రమాదమే కదానని ప్రజలు చర్చించుకుంటున్నారు. అందరికి చెప్పాల్సిన మంత్రే ఇలా వ్యవహరిస్తే ప్రజలు కూడా మంత్రిగారిని అనుకరించే ప్రమాదం లేకపోలేదు. అయితే తనకు కరోనా వైరస్ సోకదనే ధీమాతో మంత్రి గారూ ఉండడం మంచిదే. కానీ నలుగురిలో వెళ్లినప్పుడు మాస్కు వేసుకుంటే తనతో పాటు తన పక్కన ఉండే వారు కూడా సురిక్షితంగా ఉంటారు కదా? అని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మంత్రి గారి సేవలు మనకు భవిష్యత్తులో కూడా కావాలి కదామరి.