బెంగుళూరులో సేద తీరుతున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గూబ పగిలేలా ప్రముఖ ప్రవచనకర్త, సహస్రావధాని గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గుంటూరులో ఆదివారం రాత్రి జరిగిన పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55 వసంతాల వేడుకలో గరికిపాటి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గొప్పతనాన్ని గురించి ఆయన గుర్తు చేశారు. తెలుగు వారికి ప్రధాని పీఠం ఎక్కే అవకాశం వచ్చినప్పుడు ఎన్టీఆర్ వ్యవహరించిన విధానాన్ని గుర్తు చేశారు. ఆయనకు టీడీపీ అడ్డురాదని ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారని గుర్తుచేశారు.
ఎన్టీఆర్ లాంటి మహానాయకుడైనా ఎన్నికల్లో ఓడిపోతే 1989 నుంచి 1994 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి హాజరై ప్రతిపక్షనేతగా వ్యవహరించారని గరికిపాటి ప్రశంసించారు. ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తాను అసెంబ్లీకి రానని ఎక్కడా చెప్పలేదని.. సభకు వెళ్లి ప్రజా సమస్యలు చర్చించారని గరికపాటి గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గరికపాటి ఈ వ్యాఖ్యలు వైఎస్ జగన్‌ను ఉద్దేశించే చేశారని అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. పైగా ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో.. ‘నేను అసెంబ్లీకి రాను’ అనే మాటను మరీ.. నొక్కి చెప్పిన తీరు.. కచ్చితంగా జగన్ ను ఉద్దేశించే అని అంటున్నారు.
2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలతో విజయ గర్వం నెత్తికెక్కి అసెంబ్లీలో జగన్ అడుగుపెట్టారు. 2024 ఎన్నికల్లో 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలతో నిబంధనల ప్రకారం.. ఓ మూలన సీటు కేటాయించారు. కూటమి ఎమ్మెల్యేల ముందు, వారి ప్రశ్నలను తట్టుకోలేమని భయంతో జగన్ తొలి రోజు అసెంబ్లీకి హాజరై ప్రమాణ స్వీకారం చేసి.. ఇక ఆ వైపు చూడడమే మానేశారు. అలా తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లిపోయిన జగన్.. తన బెంగళూరు ప్యాలెస్ కు.. తాడేపల్లికి మధ్య నిత్యం టూర్లు వేస్తూ గడుపుతున్నారు.
అసెంబ్లీలో కనిపించడమే మానేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని జగన్ కొర్రీలు పెడుతున్నారు. 11 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అధినేతకు అసలు ప్రతిపక్ష హోదా అనేది రానేరాదనే సంగతి ఆయనకు కూడా తెలుసు. కానీ, ప్రజల దృష్టిని మరల్చి, దానిపై హైకోర్టుకు వెళ్లి నానా యాగి చేస్తుండడం.. జగన్ మనస్తత్వ వైఖరి ఎలాంటిదో చాటుతోంది. ఇలాంటి సందర్భంలో తాజాగా గరికిపాటి నరసింహారావు ఎన్టీఆర్ సభలో చేసిన ఈ వ్యాఖ్యలు బాగా పేలాయి.











