వైసీపీ నిజ స్వరూపం మరోసారి బయటపడింది. అమరావతి డెవలప్‌మెంట్‌కు సహకరిస్తాం కానీ సీడ్ క్యాపిటల్ ఒప్పందంలోకి రాలేమని సింగపూర్ చెప్పడంతో వైసీపీ వికృతానందాన్ని పొందుతోంది. సింగపూర్ నో చెప్పడాన్ని వైసీపీ అనుకూల మీడియా బ్రేకింగ్ వార్తలు వేసి మరీ తన సైకో మెంటాలిటీని బయటపెట్టుకుంటోంది. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లోనూ ట్వీట్‌లు వేసి ఆనందపడుతోంది. వైసీపీ వ్యవహారాన్ని చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేం పనికిమాలిన బుద్ధి అంటూ చీదరించుకుంటున్నారు.
నిజానికి సింగపూర్ సీడ్ క్యాపిటల్ ఒప్పందంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం జగన్. ఇదే విషయాన్ని సింగపూర్ స్పష్టం చేసింది. జగన్ ఎంతగా వేధించారో చంద్రబాబుకు స్పష్టం చేసింది. ఐతే ఇతర విషయాల్లో ఏపీకి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు సింగపూర్ ప్రతినిధులు. ఇతర పెట్టుబడులు, సహకారం విషయంలో సాయం అందిస్తామన్నారు.
2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ టైంలో ఏపీకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించింది సింగపూర్. ఉచితంగా రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ అందించింది. తర్వాత సీడ్ క్యాపిటల్ లో ఓ భాగం అభివృద్ధి చేసే ప్రాజెక్టును దక్కించుకుంది. ఐతే ఇక్కడే వైసీపీ తన నీచబుద్ధిని బయటపెట్టుకుంది. కోర్టులకు వెళ్లింది..ఎవరెవరికో మెయిల్స్ పెట్టింది. భయపెట్టేలా ఫిర్యాదులు చేసింది. ఇక అధికారంలోకి వచ్చాక అవినీతి సాకు చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసి సింగపూర్ ప్రతినిధులను రూ. 143 కోట్లు లంచం వాటాగా డిమాండ్ చేశారు. చివరికి..ఒప్పందం రద్దు చేశారు. దీంతో ఏపీ అంటేనే భయపడేలా చేశారు.
గత ఐదేళ్లూ వైసీపీ సర్కార్ రాజధాని అమరావతిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఉన్న సంస్థలను తరిమేసింది. ఈ తప్పులను సరిదిద్దేందుకు చంద్రబాబు మరోసారి సింగపూర్ వెళ్లారు. జగన్ అనే వ్యక్తి ఉన్నంతవరకు తాము ఏపీకి రాలేమని కుండబద్ధలు కొట్టారు సింగపూర్ ప్రతినిధులు. సింగపూర్ అవినీతి లేని టాప్ దేశాల్లో ఒకటి. అలాంటి దేశంపైనే జగన్ అవినీతి ముద్ర వేసి తరిమికొట్టారు. ఇప్పుడు సీడ్ క్యాపిటల్ అభివృద్ధిలో భాగం కాలేమని సింగపూర్ చెబితే..వైసీపీ, సాక్షి సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. చంద్రబాబు ఫెయిల్ అయ్యారంటూ కథనాలు వండివారుస్తున్నాయి, కానీ ఇది జగన్ నిర్వాకమే అమి మాత్రం ఎక్కడా చెప్పడంలేదు.
నిజానికి ఎవరైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్. ఏపీ అభివృద్ధి చెందకూడదనేదే జగన్ ఆలోచన. కేవలం తాను బటన్ నొక్కితే వచ్చే డబ్బుల కోసం ప్రజలు ఎదురుచూడాలనేది ఆయన ఆకాంక్ష. గడిచిన ఐదేళ్లూ ఏపీని అన్ని రకాలుగా దోచుకున్నారు జగన్. ఇప్పుడు ఏపీ క్రమంగా అభివృద్ధి బాట పడుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారు. పెట్టుబడుల కోసం ముందుకు వచ్చే కంపెనీలకు తప్పుడు మెయిల్స్ పంపుతున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయడమే రాజకీయంగా భావిస్తున్నారు వైసీపీ నేతలు.











