(శ్రీకాకుళం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
సహనానికి, మంచితనానికి మారుపేరుగా , రాజకీయ చైతన్యానికి పెట్టిందిపేరుగా ఘనతకెక్కిన శ్రీకాకుళంలో వైసీపీ, టీడీపీ సవాళ్ళతో రాజకీయ వాతావరణం కొద్దిరోజులుగా వేడెక్కింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ మంత్రులు విశాఖ రాజధాని అంశంగా రాజీనామాలకు సిద్ధం అంటూ సవాల్ చేయడంతో టీడీపీ కూడా అందుకు సై అంటోంది. మంత్రులు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేస్తోంది.
అప్పలరాజు గారూ తొందరగా రాజీనామా చేయండి : శిరీష
వైసీపీ తాజా మంత్రి, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజును టీడీపీ సిక్కోలు తాజా మాజీ అధ్యక్షురాలు, అప్పలరాజు పూర్వ ప్రత్యర్థి గౌతు శిరీష తొందరగా రాజీనామా చేసి పలాస నుండి ఎన్నికకు సిద్ధపడాలని డిమాండ్ చేస్తున్నారు. ‘విశాఖ రాజధాని అంశంతో పాటు మీ ప్రభుత్వ 16నెలల పాలనపై మీకు నమ్మకం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు వస్తే టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. పలాస నుండి మీపై ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్, లేకపోతే నేనా, కాదంటే అక్కడ నుండి ఒక సామాన్య కార్యకర్త పోటీ చేస్తారా’ అనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. అందువల్ల రాజీనామా చేసీ ఎన్నికలకు వస్తారా, మాట తప్పుతారా మీరే నిర్ణయించుకోవాలని సీదిరికి సవాల్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు.
అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం
శ్రీకాకుళం జిల్లా సీనియర్ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు వత్తాసు పలుకుతూ అదే జిల్లాకు చెందిన మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అమరావతి రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం , విమానాల్లో ప్రయాణిస్తున్నారని ఎద్దేవా చేయడం పట్ల శిరీష ఆగ్రహం వ్యక్తం చేసారు.
మంత్రి వైట్ కార్డు హోల్డర్ అవ్వగా లేంది..
వైట్ కార్డు హోల్డర్ అయిన సీదిరి అప్పలరాజు రాష్ట్ర మంత్రి అవ్వగాలేనిది అమరావతి రైతులు ఒకరోజు విమానంలో వెళ్లొస్తే తప్పేముందని ప్రశ్నించారు. ‘రైతులు పండించగా వచ్చిన బియ్యాన్ని రేషన్ షాపు ద్వారా తీసుకుని తింటున్న మీరు , వారిపట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని’ మంత్రి అప్పలరాజును ఉద్దేశించి శిరీష స్పష్టం చేశారు.
మంత్రి గారి చేతుల్లో బంతి
శ్రీకాకుళంలో జరుగుతున్న పరిణామాలను కొద్ధిరోజులుగా పరిశీలిస్తున్న వ్యక్తులు ఇప్పుడు బంతి మంత్రి అప్పలరాజు చేతుల్లోనేవుందని, రాజీనామా చేసి ఎన్నికలకు వెళతారా లేదంటే ఆయన మాట తప్పుతారా తేల్చుకోవాల్సివుందని అంటున్నారు. మరి మంత్రి గారు ఏంటి చేస్తారో వేచి చూడాలి.











