ఏపీలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆలయాలపై దాడుల ఘటనలు జరుగుతుండడం ఒక ఎత్తయితే ప్రభుత్వ సర్వీసులో ఉన్న అధికారులు ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, హిందూ మతానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేయడం, మత పరమైన ప్రైవేటు కార్యక్రమాలకు అతిథులుగా హాజరుకావడం, అన్యమతస్తులే ఈ దాడుల ఘటనలపై విచారణాధికారులుగా ఉండడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది.
దీనిపైనే పలు అభ్యంతరాలు
ప్రస్తుతం రామతీర్థంలో రాముడి విగ్రహ తల నరికివేత ఇష్యూలో ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఆ విచారణ చేస్తున్న టీంకి సీఐడీ చీఫ్, ఐపీఎస్ అధికారి సునిల్ కుమార్ సారధ్యం వహిస్తున్నారు. దీనిపైనే పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్యమతస్తులైనవారికి ఈ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. మరికొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. హిందువుగా ఉండి..రెడ్డి వర్గానికి చెందని వ్యక్తిని విచారణ అధికారిగా నియమించాలని డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు అదిగో చంద్రబాబుతో పాటు మరికొందరు మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.ఈ నేపథ్యంలో సునిల్ కుమార్‌కు సంబంధించిన ఓ వీడియలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బ్రిటీషు వారు దేవుడిని ఇచ్చారని..
ఎవరి మతం వారిది..ఎవరి వర్గం వారిది.. అయితే, ప్రభుత్వ విభాగాల్లో, బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తుల మాటలకు చాలా విలువ ఉంటుంది. వారి మాటలు సమాజంపై చాలా ప్రభావం చూపుతాయి. సునిల్ కుమార్ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బ్రిటీషు వారు మనకు దేవుడిని ఇచ్చారని, భాష నేర్పారని, స్కూళ్లను పరిచయం చేశారని, వారి పుణ్యం వల్ల దేవుడిని కొలుస్తున్నామని వ్యాఖ్యానించారు. అంటే బ్రిటీషు వారిని కీర్తిస్తూనే..మతపరమైన ప్రచారం చేశారని చెప్పాల్సి ఉంటుంది. దీనిపైనే అసలు వివాదం తలెత్తుతోంది.
దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా..
ఆయన ఏ మతానికి చెందిన వారనేది పక్కన బెట్టాలని, నిష్పాక్షికంగా విచారణ జరిపే అధికారులకు మతం అంటగట్టకూడదనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కాని.. గతంలో చాలా మంది అధికారులు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వారివారి వర్గాలకు సంబంధించిన కార్యక్రమాల్లో హాజరయ్యారు. వారి అభ్యున్నతికి కొన్ని సూచనలూ చేశారు. వాటిలో చాలా వరకు సామాజిక సంక్షేమం, సమతౌల్యత, సర్వ సమానత్వ హక్కుల వంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. కాని సునిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని, బ్రిటీషు వారిని కీర్తించడం ఏంటనే కామెంట్లూ వస్తున్నాయి. దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా కేవలం క్రైస్తవ మతం కోసం బ్రిటీషు వారిని కీర్తించే వ్యక్తి..హిందూ మతానికి సంబంధించిన అంశంలో నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని ఎలా అనుకోవాలనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
ఇక్కడే మరో విషయం కూడా ఉంది. గతంలో ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వివాదం తలెత్తిన సమయంలో డేటాకు సంబంధించిన అంశంలో సీఐడీ విచారణ జరిగింది. ఈ విచారణ జరిగిన సమయంలోనూ సునిల్ కుమార్ సీఐడీ చీఫ్‌గా ఉన్నారు. కాని ఆ సమయంలో సునిల్ కుమార్ మతానికి సంబంధించిన అంశం తెరపైకి రాలేదు. మతపరమైన అభ్యంతరాలూ వ్యక్తం కాలేదు. కేవలం రామతీర్థంలో జరిగిన ఘటన హిందూ మతానికి వ్యతిరేకంగా జరిగిందని, అలాంటిది మళ్లీ వేరే మతానికి చెందిన వారిని, అందులోనూ తమకు దేవుడిని ఇచ్చారంటూ బ్రిటీషు వారిని కీర్తించేంత మతాభిమానం ఉన్న సునిల్ కుమార్ లాంటి వ్యక్తికి అప్పగించడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.