తెలంగాణాలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి గాడిలో పెట్టినట్లుగానే ఇతర ప్రభుత్వ శాఖలను కూడా సరిదిద్దాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భావిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పోలీస్, పంచాయతీ, ఆర్ అండ్ బీ శాఖలపై ఆయన దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ముందుగా పోలీస్ శాఖ ప్రక్షాళన కోసం ఇప్పటికే సీనియర్ అధికారులతో చర్చించినట్లు చెబుతున్నారు.
పోలీస్ శాఖలో నానాటికి పెరిగిపోతున్న అవినీతి, వారిలో పెరుగుతున్న అమానవీయత వంటి అంశాలను సరిదిద్దాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సన్నిహితుల వద్ద అన్నట్లు చెబుతున్నారు. పోలీసు వ్యవస్థను సరిదిద్దితే ప్రజలంతా తమకు మద్దతుగా నిలుస్తారన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. ఇటీవల రెవెన్యూ వ్యవస్ధను సరిదిద్ది గాడిన పెట్టడం ప్రారంభించినప్పటి నుంచి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం అంచనా వేస్తోంది.
వీఆర్ఓల వ్యవస్ధను రద్దు చేస్తే ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లు అవుతుందని పార్టీలో కొందరు సీనియర్లు చెప్పినా… అలాంటిదేమి జరగదని, పైగా ప్రజల నుంచి మంచి మద్దతు వస్తుందని ముఖ్యమంత్రి నాయకులకు హామీ ఇచ్చారు. వీఆర్ఓల విషయంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు అంచనా నిజమైంది. ప్రతిపక్షాలు ఒకటి రెండు రోజులు వీఆర్ఓల అంశంపై పెదవి విప్పినా ప్రజల నుంచి ప్రభుత్వానికి పూర్తి మద్దతు రావడంతో మిన్నకుండిపోయారు. దీంతో ముఖ్యమంత్రికి, మంత్రులు, శాసనసభ్యులతో పాటు పార్టీ సీనియర్ నాయకులకు కూడా సీఎం తీసుకున్న నిర్ణయాలపై గురి ఏర్పడింది. ఇప్పుడు పోలీసు వ్యవస్థపై కూడా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయని అంటున్నారు.
పోలీస్ వ్యవస్థ అస్తవ్యస్తం…
తెలంగాణాతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ పోలీస్ వ్యవస్ధ అస్తవ్యస్తంగానూ, అవినీతిమయంగానూ మారిందనే విమర్శలొస్తున్నాయి. పోలీసుల పనితీరుతో పాటు ప్రజల పట్ల వారి ప్రవర్తన కూడా అనేకసార్లు చర్చనీయాంశంగా మారింది. దీంతో ముందుగా తెలంగాణాలో పోలీసు వ్యవస్ధను గాడిలో పెట్టాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. పోలీస్ వ్యవస్థలో పెరిగిన అవినీతిని రూపుమాపాలంటే వారికి మంచి జీతాలు, అలవెన్సుల ఇవ్వాలని, అలాగే పని వేళల్లో కూడా మార్పులు చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు.
పోలీసు వ్యవస్థలో కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకూ కుటుంబాలతో గడపలేకపోతున్నామనే అసంతృప్తి ఉందని, దీన్ని పోగొడితే మంచి ఫలితాలు వస్తాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పోలీసులకు వీక్లీఆఫ్ ప్రకటించారు. ఇక్కడ కూడా అలా చేయడంతో పాటు పని వేళల్లో కుదింపు చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు భావిస్తున్నారు. అలాగే ఎన్నో దశాబ్దాలుగా అమలులో ఉన్న ఆర్డర్లీ వ్యవస్ధ రద్దుతో పాటు కానిస్టేబుళ్లు, హోం గార్డులు ఉన్నతాధికారుల ఇళ్ల వద్ద పని చేసే సంప్రదాయానికి స్వస్తి పలకాలని కూడా ముఖ్యమంత్రి భావనగా చెబుతున్నారు.
ప్రతి శాఖలోనూ అవినీతి ఉంటుందని, అయితే దాన్ని అదుపు చేయగలమే తప్ప పూర్తిగా తొలగించలేమన్నది ముఖ్యమంత్రి భావనగా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖలో సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని చెబుతున్నారు. పోలీస్ శాఖ ప్రక్షాళన కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై రిటైర్ట్ పోలీస్ అధికారులతో చర్చించాలని, అలాగే, ప్రజల దగ్గర నుంచి కూడా సలహాలు తీసుకుని ఆ శాఖను ప్రక్షాళన చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు.











