గన్నవరం రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ ఆ తరవాత వైసీపీలో చేరిపోయారు. అయితే, గన్నవరం వైసీపీలో వంశీ ఇమడలేకపోతున్నారు. టీడీపీ నుంచి గెలిచి గన్నవరం వైసీపీలో నీ పెత్తనం ఏంటంటూ ప్రత్యర్థులు నిలదీస్తున్నారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఓకే అంటే రాజీనామా చేసి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసి గెలవాలని వంశీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. గన్నవరం వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసినా మాజీ మంత్రి దేవినేని ఉమను రంగంలోకి దింపాలనే యోచనలో టీడీపీ ఉందని తెలుస్తోంది.
నేను రెఢీ ..దేవినేని
గన్నవరం ఉప ఎన్నిక జరిగితే పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసేందుకు తాను సిద్దమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గన్నవరం ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని టీడీపీ అధినేత పట్టుదలతో ఉన్నారట. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ అధినేత చంద్రబాబుపై చేస్తున్న తీవ్ర విమర్శలే ఇందుకు కారణమంటున్నారు. ఉపఎన్నిక జరిగితే ఎలాగైనా వంశీని ఓడించాలని టీడీపీ యంత్రాంగం మొత్తాన్ని సిద్దం చేస్తున్నారట. అదే జరిగితే గన్నవరం ఉపఎన్నిక, తెలంగాణలోని దుబ్బాకను తలపించనుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కొనేందుకే సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఈ సమయంలో గన్నవరం ఉపఎన్నిక పెట్టడం అంటే నిప్పుతో తలగోక్కోవడం లాంటిదే. అందుకే గన్నవరం ఎమ్మెల్యే వంశీ మాత్రం సీఎం ఆదేశిస్తే తాను రాజీనామాకు సిద్ధం అంటారు. ఇదంతా చూస్తుంటే, ఏదో డ్రామాలా ఉంది. అంటే ఇలాగే మరో మూడున్నరేళ్లు సాగదీస్తారని తెలుస్తోంది. గన్నవరంలో టీడీపీని ఎదుర్కోవడం కష్టం. దీనికితోడు గన్నవరం వైసీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డ, దుట్టా పావులు కదుపుతున్నారు. వంశీని ఓడించి గన్నవరం నుంచి ఖాళీ చేయించాలని వారు ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న వైసీపీ అధిష్ఠానం గన్నవరం ఎమ్మెల్యే రాజీనామా కోరకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.