మనసు లోతులను తాకే పదునైనది పాట .. హృదయమనే ఉద్యానవనంలో పరిమళాలు వెదజెల్లేది పాట .. వేల మాటలు చెప్పలేని భావాన్ని అందంగా ఆవిష్కరించేది పాట.
ఒక్కమాటలో చెప్పాలంటే మధురమైన పాట మంత్రంలా పనిచేస్తుంది .. పదాల జలపాతమై దూకుతూ వచ్చి ఉత్సాహాన్ని నింపుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ పాట అంటే ఇష్టపడతారు .. అది అందించే అనుభూతులను తోడుగా చేసుకుని ఆ బాటలో నడవడానికి ఆసక్తిని చూపుతారు. పాటకి గల ప్రధానమైన లక్షణమే పరవశింపజేయడం. సినిమాల్లో ఓ నాలుగైదు నిమిషాల సేపు మాత్రమే సాగే పాట, మనసుకు ఎంతో హాయిగా అనిపించడానికి కారణమిదే. అందువల్లనే సినిమాల్లో పాటలకి అధిక ప్రాధాన్యత ఉంటుంది.
ప్రేక్షకులను థియేటర్స్ కి తీసుకెళ్లే శక్తి కూడా పాటకి ఉందనే విషయాన్ని గతంలో కొన్ని పాటలు నిరూపించాయి. అలాంటి పాట ఒకటి ‘మిడిల్ క్లాస్ మెలొడీస్‘ సినిమాలో వినిపిస్తోంది. అదే గుంటూరు సామాజిక జీవన విధానానికి అద్దం పట్టే పాట. ఈ సినిమా కథ ‘గుంటూరు’ నేపథ్యంలో సాగుతుంది. అందువలన ‘గుంటూరు’పైనే ఒక పాటను చిత్రీకరించారు. ‘తెల్లారే .. ఊరంతా తయ్యారే, ముస్తాబై పిలిచింది గుంటూరే‘ అంటూ ఈ పాట మొదలవుతోంది. ‘రద్దీలో యుద్ధాలే మొదలాయే .. తగ్గేదే లేదంటా ప్రతివాడే’ అంటూ అక్కడి నుంచి ముందుకు సాగుతుంది.
ఉదయం వేళలో గుంటూరు ఎలా ఉంటుంది? అక్కడి ప్రజల జీవన విధానం ఎలా మొదలవుతుంది? రోడ్లు ఎంత రద్దీగా ఉంటాయి? ఎవరికి వారు ముందుగా తమ పనులను పూర్తి చేసుకోవడానికి ఎంత హడావిడి పడుతుంటారు? అనేది ఈ పల్లవిలో అర్థవంతంగా చూపించారు. ఇక ‘అలుపంటూ లేదంటే సూరీడే .. పగలంతా తడిసేలే సొక్కాలే‘ అంటూ గుంటూరులో ఎండలు ఎంత ఎక్కువగా ఉంటాయో .. అందువలన ఎంతగా ఉక్కబోసి చమటలు పడతాయనేది చెప్పుకొచ్చారు.
ఆ తరువాత వరుసలుగా ‘ఎన్నెన్నో సరదాలే కొలువుంటే .. కారాలే నూరేది అంటారే‘ కనిపిస్తాయి. అక్కడి ప్రజలు కష్టంలోనే ఆనందాన్ని వెతుక్కుంటారనీ, వాళ్లలో పౌరుషం పాళ్లు ఎక్కువేననే విషయాన్ని వివరిస్తూనే .. ‘మిర్చి’ పంటకి గుంటూరు ప్రసిద్ధి అనే విషయాన్ని గుర్తుచేశారు. చివరిగా ‘మరుపేరాని ఊరే గుంటూరే‘ అంటూ ఆ ఊరుపట్ల తమకి గల అభిమానాన్ని చాటుకోవడం కనిపిస్తుంది.
పాఠంలా సమగ్రంగా చెప్పవలసిన విషయాలను పాటగా చెప్పినతీరు బాగుంది. కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపన ఈ పాటకి ప్రధానమైన బలంగా నిలిచాయి. ‘గుంటూరు’ ప్రత్యేకతను .. ప్రాధాన్యతను అందంగా .. అర్థవంతంగా ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ కారణంగానే ఇటీవల వదిలిన ఈ పాట జనంలోకి బాగా దూసుకెళ్లింది. ఆనంద్ దేవరకొండ, వర్ష జంటగా వినోద్ అనంతోజు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 20వ తేదీన ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ద్వారా పలకరించనుంది.
AlsoRead ;- రాజశేఖర్ కూతుళ్ళ తో యంగ్ హీరో రొమాన్స్ !