జనసేనాని పవన్ కల్యాణ్ కు కాస్త ఖాళీ దొరికింది! జనసేన పార్టీకోసం కాస్తంతయినా సమయం కేటాయించడానికి ఆయనకు ఇప్పుడు వ్యవధి ఉంది. అందుకే పార్టీ సమావేశాలు ప్లాన్ చేశారు. ఈనెల 17, 18 తేదీల్లో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే క్రియాశీలక సమావేశాలకు పవన్ కల్యాణ్ స్వయంగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గాల నాయకులతో సమీక్షలు నిర్వహించనున్నారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు ఇన్సూరెన్సు కూడా చేయిస్తున్నారు.
సుదీర్ఘకాలం ఫార్మ్ హౌస్ కు పరిమితం అయిన తర్వాత.. ఆయన తొలిసారిగా వకీల్ సాబ్ షూటింగ్ కోసం అడుగు బయటపెట్టారు. కొన్ని రోజులుగా ఆయన ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కాగా.. వకీల్ సాబ్ కు సంబంధించి పవన్ తో అవసరం ఉండే కీలక సన్నివేశాల షూటింగ్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తోంది. ఇంకా చాలా చిత్రాలు ఆయన కోసం వెయిటింగ్ లో ఉన్నాయి. ఈ మధ్యలో పవన్ కల్యాణ్‌కు కాస్త గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో ఆయనకు పార్టీ మీద దృష్టి సారించడానికి తీరిక దొరికింది.
ఇప్పటిదాకా ఐదు జిల్లాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు పూర్తి చేశారు. అక్కడి నాయకులతో సమీక్ష సమావేశాలు ఉంటాయి. అదే మాదిరిగా మరో 32 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు మొదలు కానుంది. ఆయా ప్రాంతాల నాయకులకు పవన్ కల్యాణ్ స్వయంగా దిశానిర్దేశం చేస్తారు. మధ్యలో ఒకరోజు అమరావతి ప్రాంత రైతులు, అక్కడి పోరాట సమితి నాయకులతో కూడా పవన్ సమావేశం అవుతారు.
కొన్ని నెలలుగా ఏపీలో అడుగుపెట్టకుండా గడిపేసిన పవన్ కల్యాణ్.. ఇప్పటికైనా పార్టీ కార్యకలాపాల్లోకి తాను క్రియాశీలంగా రావడం పట్ల.. కార్యకర్తల్లో మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
AlsoRead ;- మెట్రో ఎక్కే అవసరం పవన్ కల్యాణ్‌కు ఏంటి?
AlsoRead ;- గ్రేటర్ ఎన్నికల వేళ.. భలేగా ట్విస్టు ఇచ్చిన పవన్