హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ చిక్కులలో పడ్డారు. అధ్యక్షుడి హోదాలో ఆయన అంబుడ్స్‌మన్ ను నియమిస్తూ తీసుకున్న నిర్ణయం విమర్శలకు గురవుతోంది. జస్టిస్ లోధా సిఫారసుల మేరకు బీసీసీఐతో సహా ఇతర రాష్ట్రాల క్రికెట్ సంఘాలు తమ పూర్తి వివరాలు అందచేయవలసి ఉంది. సర్వోన్నత న్యాయస్థానం కూడా జస్టిస్ లోధా సిఫారసులను అమలు చేయవలసిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ తమ పరిధిలోని క్రికెట్ క్లబ్ లకు ఓ లేఖ వ్రాశారు. క్లబ్ కు సంబందించిన పూర్తి వివరాలను తమకు అందచేయాలంటూ అజార్ ఆ లేఖలో కోరారు. జస్టిస్ లోధా సిఫారసుల మేరకు ‘జోడు పదవులు’ చెప్పట్టరాదనే నిబంధన ఉంది. ఈ నిబంధనతో చాలా క్లబ్ లు సమాచారం ఇవ్వడానికి జంకుతున్నాయి. దీంతో వారందరూ అజార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఈ వివాదాలకు స్వస్తి పలికేందుకు అజార్ జస్టిస్ దీపక్ వర్మను అంబుడ్స్‌మన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అజార్ తీసుకున్న ఈ నిర్ణయం అగ్నికి ఆజ్యం పోసింది. దీపక్ వర్మ క్లోజ్ కావడంతోనే అజార్ తీసుకున్నాడని వ్యతిరేఖ వర్గం ఆరోపణలకు దిగింది. మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో చేర్చకుండా అంబుడ్స్‌మన్ నిర్ణయం ఎలా తీసుకున్నారని అజార్ వ్యతిరేఖ వర్గం మండిపడింది. దీంతో అజార్ . మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో ఈ అంశం ఉందని అజార్ తన వాదనను వినిపిస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కరోనా కారణంగా ఇప్పటి వరకు జరగలేదని పేర్కొన్న అజార్ అందుకే అంబుడ్స్‌మన్ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పుకొచ్చారు. కానీ ఈ వివాదం సద్దుమణగలేదు. వ్యతిరేఖ వర్గం అజార్ పై దూషణకు దిగారు.
హెచ్‌సీఏ సభ్యులు తనను దూషించారని అజార్ హైదరాబాద్, ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏ కోశాధికారి అగర్వాల్ పై అజార్ కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో అగర్వాల్ పై నిధుల విషయంలో గోల్ మాల్ చేశారంటూ మరో కేసు నమోదైంది. పోలీసు స్టేషన్ దాక హెచ్‌సీఏ గొడవ చేరుకోవడంతో బీసీసీఐ నుంచి అజార్ కు వార్నింగ్ వచ్చిదంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు శివలాల్ యాదవ్, వివేక్ లు అజార్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని వార్తలు వినబడుతున్నాయి.











