నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంత పరిధిలో ఉన్న 475 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో దాదాపు 15కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమబెంగాల్‌లో మూడో విడతలో 31 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగ్గా సగటున 77.6శాతం పోలింగ్ జరిగింది. తమిళనాడులో 234 స్థానాలతో పాటు కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికలూ మంగళవారం జరిగాయి. సగటున తమిళనాడులో 63.4శాతం పోలింగ్ నమోదైంది. ఇక మూడోవిడత (చివరి దశ)లో అసోంలో 40 స్థానాలకు 78.9శాతం, కేరళలో 140 స్థానాలకు 69.95 శాతం, పుదుశ్చేరిలో 30 స్థానాలకు 77.9శాతం పోలింగ్ నమోదైంది.
పశ్చిమబెంగాల్‌లో పలు హింసాత్మక ఘటనలు
కాగా పశ్చిమబెంగాల్‌లో పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. హుగ్లీలోని ఆరంబాగ్‌లో టీఎంసీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో భద్రతా బలగాలు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. కాగా టీఎంసీ నేత ఇంట్లో ఓ ఈవీఎం, వీవీ ప్యాట్ లభించడం సంచలనం రేపింది. ఎన్నికల అధికారి తపన్ సర్కార్ స్వయంగా దీన్ని తీసుకెళ్లినట్టు తేలడంతో ఎన్నికల సంఘం సదరు అధికారిని సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదుకు ఆదేశించింది. 17 సెక్టర్ ఉలుబేరియా ఉత్తర్ పోలింగ్ కేంద్రంలో వినియోగించాల్సిన ఈ ఈవీఎంను ఎన్నికల సంఘం సీజ్ చేసింది. సదరు నాయకుడు ఎన్నికల అధికారి బంధువు కావడంతో ఈ చర్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇక సిలిగురిలో ఓ దుకాణంలో ఐదు బాంబులు పట్టుబడ్డాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. టీఎంసీ ఆరంభాగ్ అభ్యర్థి సుజాత మండల్ పై ఇటుకలతో దాడికి యత్నించారు. ఈ దాడికి బీజేపీ కారణమని టీఎంసీ ఆరోపించింది. పశ్చిమ బెంగాల్‌లో కీలక జిల్లాల్లో భారీగా పోలింగ్ మనోదైంది. హుగ్లీలో 79.29 శాతం నమోదు కాగా, హౌరాలో 77.91, సౌత్ 24 పరగణాల్లో 76.74 శాతం, గోఘాట్ 84.71 శాతం,డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో 75.17, తారకేశ్వర్‌లో 78.37 శాతం నమోదైంది.
ఈ నాలుగు ప్రాంతాల్లో ప్రశాంతం
తమిళనాడు, అసోం, కేరళ, పుదుశ్చేరిలో చిన్నచిన్న ఘటనలు, రాజకీయ ఆరోపణలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తమిళనాడులో బీజేపీ గుర్తు ఉన్న వాహనంలో కుష్బూ ఓటు వేసేందుకు వెళ్లారని డీఎంకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మరోవైపు కరుణానిది కుటుంబంలోని కీలక వ్యక్తి, ఎన్నికల బరిలో తొలిసారిగా నిలిచిన ఉదయనిధిపై వైరి పక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల గుర్తు ఉన్న దుస్తులు ధరించి ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇలా చేశారని ప్రత్యర్థి పార్టీలు విమర్శించాయి. చెపాక్-తిరువల్లికేని స్థానం నుంచి తొలిసారిగా ఉదయనిధి పోటీచేస్తున్న విషయం తెలిసిందే.
ఇక తమిళనాడులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాట చిన్నమ్మగా పిలిచే శశికళ తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. శశికళకు చెన్నైలోని థౌంజండ్ లైట్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఓటు హక్కు ఉండేది. గతంలో జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్ లోనే శశికళ నివాసం ఉండేవారు. ఆ ప్రాంతం థౌంజండ్ లైట్స్ అసెంబ్లీ పరిధిలో ఉంది. అయితే ఓటరు జాబితాలో శశికళ పేరు లేకపోవడంతో ఆమె ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు. కాగా ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉందని, శశికళ ఓటు హక్కు విషయంలో కుట్రలకు తావులేదని, గడువు తీరాక ఓటు హక్కు కోసం తమను శశికళ సంప్రదించారని ఎన్నికల సంఘం ప్రకటించింది. కేరళ, పుదుశ్చేరి, అసోంలోనూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
ఇక తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన సొంత రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుంబాగం పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆమెతో పాటు భర్త డాక్టర్ సౌందరరాజన్ కూడా ఉన్నారు. పశ్చిమబెంగాల్ మినహా అన్నిచోట్లా ఎన్నికలు పూర్తయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో నాలుగో విడత ఏప్రిల్ 10, ఐదో విడత ఏప్రిల్ 17న, ఆరో విడత ఏప్రిల్ 22న, ఏడో విడత ఏప్రిల్ 26, ఎనిమిదో (చివరి)విడత ఏప్రిల్ 29న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే2న వెల్లడి కానున్నాయి.











