బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్నాయి. అల్ప పీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో మరో 24 గంటల పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంటుంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు నగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి నగర జనజీవనం స్తంభించింది. దీంతో రోడ్లన్నీ జలమయమ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగాలకు వెళ్లే వారు వర్షంలో తడుస్తూనే వెళ్లాల్సి వచ్చింది. వర్షం కారణంగా రోడ్లన్నీ గుంతలుగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పొంగిపొర్లుతున్న వాగులు..
రోడ్లపైకి భారీగా వర్షం నీరు వచ్చి చేరడంతో శుక్రవారం రాత్రి కూకట్‌పల్లి, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, మెహిదీపట్నం, అమీర్‌పేట్, సికింద్రాబాద్, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షానికి కొన్ని ఏరియాల్లో పంట పొలాలన్నీ నీట మునిగాయి. రంగారెడ్డి జిల్లా నందిగామాలో 18.3 సెం.మీ. వర్షపాతం నమోదైతే కోతూర్‌లో 14.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే సూర్యాపేట జిల్లా నడిగూడెం గ్రామంలో 13.8 సెం.మీ., కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 17.9 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిసింది. అలాగే వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో చెరువులు, వాగులు పొంగిపొర్లి ప్రాజెక్టుల్లో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.
మరో వారం ఇలానే..
అంతేకాకుండా హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురవడంతో హైదరాబాద్ రోడ్లు జలశయాలను తలపించాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని పలుచోట్ల ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే ఈరోజు, రేపు(ఆదివారం) కూడా చిరుజల్లులు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 28 నుంచి వెనుదిరగనున్నట్లు తెలిసింది. అంటే మరో వారం రోజుల వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది.











