బెజవాడ రమేష్ హాస్పిటల్- స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం విషయంలో రామ్ చాలా యాక్టివ్ గా ట్వీట్లు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. రమేష్ తనకు మామయ్య కావడంతో ఈ విషయంలో రామ్ చురుగ్గా స్పందించాడు. మామయ్య రమేష్‌ను సమర్థించడంతో పాటు… జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలాంటి ట్వీట్లు కూడా చేశారు. అయితే రమేష్ హాస్పిటల్ గురించి.. రామ్ ట్వీట్లపై అక్కడి పోలీసు అధికారులు రెస్పాండ్ అయ్యారు. అవసరమైతే ఆయనకు నోటీసులు ఇస్తాం అని కూడా హెచ్చరించారు. ఆ నేపథ్యంలో రామ్.. ఇక ట్వీట్లు చేయను అంటూ ప్రకటించారు.
రామ్ ప్రకటన చూడబోతే.. పొలిటికల్ ట్వీట్లకు మాత్రమే పరిమితం అయినట్లుంది. తాజాగా సామాజిక స్పృహతో కూడిన ట్వీట్ పెట్టాడు. నా ప్రియమైన సోదర సోదరినులారా? కరోనాకంటె వేగంగా.. కులం అనే అంటువ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. అది మరింత ప్రమాదకరమైనది. నిశ్శబ్దంగా వ్యాపించే ఇలాంటి వ్యాధినుంచి దూరంగా ఉండండి. అది మిమ్మల్ని అందులోకి లాగడానికి చాలా గట్టిగానే ప్రయత్నిస్తుంటుంది అని రామ్ ట్వీట్ లో పేర్కొన్నాడు.
ఈ ట్వీట్ చూస్తే చాలు.. రామ్ రాజకీయంగా ఏమీ ప్రస్తావించలేదు గానీ.. ఎవరిని ఉద్దేశించి ఈ కులం అంటువ్యాధి గురించి పేర్కొంటున్నాడో.. ఎవరి మీద ఫోకస్ పెడుతున్నాడో స్పష్టంగానే అర్థమవుతుంది.
కాగా రమేష్ హాస్పిటల్ మీద విచారణ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. హాస్పిటల్ అధినేత, రామ్ మామయ్య డాక్టర్ రమేష్ బాబు.. ఇంకా పోలీసుల విచారణకు హాజరు కాలేదు.











