అందానికి నిలువెత్తు రూపంలా నివేదా పేతురాజ్ కనిపిస్తుంది. పసిడి శిల్పం పట్టుచీరకట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి నివేదా పేతురాజ్ ఇప్పుడిప్పుడే కథానాయికగా నిలదొక్కుకుంటోంది. ‘మెంటల్ మదిలో’ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన నివేదా పేతురాజ్, ‘చిత్రలహరి’ .. ‘బ్రోచేవారెవరురా’ సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇంతవరకూ చేసిన పాత్రల్లో ఆమె తళుక్కున మెరిసింది .. కుర్రాళ్ల ఊహల్లో ఊర్వశిలా నిలిచింది. రామ్ హీరోగా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రెడ్’ లోను ఆమె నటించింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ సినిమాను గురించి మాట్లాడింది.
“రామ్ జోడీగా ఈ సినిమాలో చేసే అవకాశం వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. తమిళ మూవీ ‘తడమ్’కి ఇది రీమేక్ అని చెప్పారు. ఒరిజినల్ లో ‘విద్య ప్రదీప్’ చేసిన పాత్రను నేను చేయవలసి ఉంటుందని అన్నారు. అయితే ఆ సినిమా చూస్తే ఆ పాత్ర ప్రభావం నా నటనపై పడుతుందనే ఉద్దేశంతో చూడలేదు. సెట్లో డైరెక్టర్ గారు చెప్పినదానిని చేస్తూ వెళ్లాను. ఆల్రెడీ ఆ సినిమా చూసినవాళ్లు, ఈ సినిమా చూసిన తరువాత నా నటనపై ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి.
ఇక ఎనర్జిటిక్ స్టార్ అనే బిరుదు రామ్ కి కరెక్ట్ గా సరిపోతుంది. ఆయన సెట్లోకి వచ్చిన దగ్గర నుంచి వెళ్లేంతవరకూ అదే ఎనర్జీతో ఉంటారు. ఈ సినిమాలో ఆయన రెండు పాత్రలు చేస్తూ అదే ఎనర్జీతో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆయన ఎనర్జీ డాన్సుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఆయనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది .. వాళ్లను ఉత్సాహ పరచడం కోసం ఆయన చాలా కష్టపడతాడు. నిజంగా ఆయనతో కలిసి డాన్స్ చేయడం హీరోయిన్స్ కి ఒక పరీక్షవంటిదే. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం ఉంది” అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.