పాలపర్తి డేవిడ్ రాజు. ప్రకాశం జిల్లాకు చెందిన దళిత నేత, మాజీ ఎమ్మెల్యే. 1999 సంతనూతలపాడు టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. తరవాత వైసీపీ 2014లో వైసీపీ నుంచి యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించారు. ఆ తరవాత ఆయనకు 2019లో టికెట్ దక్కలేదు. దీంతో కోపం వచ్చి టీడీపీలో చేరిపోయారు.
ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో మరోసారి ఓపిక చేసుకుని వైసీపీలోకి దూకారు. దీంతో ఆయన ఏపీలోని రెండు ప్రధాన పార్టీలకు సేవలందించినట్టయింది. ఇదంతా ఎందుకంటే తాజాగా మరోసారి డేవిడ్ రాజు సర్వశక్తులు ఒడ్డి టీడీపీలోకి దూకేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి దూకేయడానికి డేవిడ్ రాజు సిద్ధంగా ఉన్నారని జిల్లా రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అందరూ ఆహ్వానిస్తున్నారు
యర్రగొండపాలెం టీడీపీ నేతలు కొందరు తనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని డేవిడ్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. అయితే ఆయన వస్తే టీడీపీ సర్వనాశనం అవుతుందని నియోజకవర్గ నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి, డేవిడ్ రాజు రాకను వ్యతిరేకించారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి కూడా తెలియజేశారు. దీంతో టీడీపీ అధినేత డేవిడ్ రాజును తీసుకునే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
బకాయిలు చెల్లిస్తారా?
2019 ఎన్నికలకు ముందు డేవిడ్ రాజును టీడీపీలోకి ఆహ్వానించారు. అప్పటి ప్రకాశం జిల్లా మంత్రి శిద్దారాఘవరావు టీడీపీలోకి వస్తే ఆర్థికంగా ఆదుకుంటానని డేవిడ్ రాజుకు భరోసా ఇచ్చారట. నిజమేనని నమ్మి డేవిడ్ రాజు 2019 ఎన్నికలకు ముందే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలు వచ్చాయి. డేవిడ్ రాజుకు మాత్రం ఆర్థిక సాయం అందలేదు. దీంతో టీడీపీ నేతలపై కోపంతో రగిలిపోయారట. మరలా వైసీపీలో చేరిపోయారు.
అయితే ఈసారి ఆ పార్టీలో డేవిడ్ రాజుకు కార్యకర్త కూడా నమస్కారం పెట్టడం లేదట. ఇక పార్టీ పెద్దలయితే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదట. దీంతో వైసీపీని ప్రకాశం జిల్లాలో ఎలాగైనా దెబ్బతీయాలని డేవిడ్ రాజు కసితో ఉన్నాడని తెలుస్తోంది. ఇందుకు టీడీపీ సరైన వేదికగా ఆయన భావిస్తున్నారట. చంద్రబాబు అనుమతిస్తే టీడీపీలో తన సేవలు కొనసాగిస్తానని డేవిడ్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. అయితే ఆయనకు చంద్రబాబు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు.
ఎటూ కాకుండా పోతాడేమో…
డేవిడ్ రాజు పరిస్థితి ఏపీలో రెండు ప్రధాన పార్టీలు ఆయన్ను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఒక్కో పార్టీ తీర్థం రెండు సార్లు తాగేశాడు. ఇంకా ఎన్నిసార్లు పార్టీ మారతాడనే అనుమానం టీడీపీ అధినేతకు వస్తోందట. అందుకే డేవిడ్ రాజు సేవలు వినియోగించుకునేందుకు టీడీపీ అధినేత సిద్దంగా లేరని తెలుస్తోంది. ఇక వైసీపీ నేతలు డేవిడ్ రాజుకు పట్టించుకునే తీరిక వారికి లేదు. ఇక డేవిడ్ రాజుకు బీజేపీ, జనసేనే దిక్కేమో చూడాలి.