తెలంగాణాలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ కలల్ని సాకారం చేసుకుందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణా వ్యవహారాల రాష్ట్ర ఇన్ చార్జిని కూడా మార్చింది. ఇప్పుడు పార్టీ ఇన్ చార్జిగా మణిక్కం ఠాగూర్ ను నియమించింది. గత పార్టీ ఇన్ చార్జిలు వ్యవహరించినట్లుగా కాకుండా ఈ సారి మణిక్కం ఠాగూర్ నూతన పద్దతులను అవలంబిస్తూ పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నారంటున్నారు.
ముఖ్యంగా ఇంతకు ముందు ఇన్ చార్జ్ లు వ్యవహరించినట్లుగా కాకుండా నూతన పద్దతులు అవలంబించేందుకు సిద్ధమవుతున్నారు మణిక్కం ఠాగూర్. ఇందులో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన నాయకులు తనను కలిసేందుకు రావద్దని, తానే వారిని కలిసేందుకు వస్తానని మణిక్కం ఠాగూర్ నాయకులకు వివరిస్తున్నారు. ఆ పనికి ఇప్పటికే శ్రీకారం చుట్టారు కూడా.
ముందుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకుల ఇళ్లకు వెళ్లి వారితో మంతనాలు జరుపుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్ధులను ఎంపిక చేయడంతో పాటు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, నూతన కార్యవర్గం వంటి అంశాలపై కూడా నాయకులతో చర్చిస్తున్నారని చెబుతున్నారు. ఇంత వరకూ కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ బహిరంగంగా జరిగేవి. ఇప్పుడు మణిక్కం ఠాగూర్ ఇన్ చార్జిగా వచ్చిన తర్వాత బహిరంగం అనే పదానికి అర్ధం మార్చేసి “అంతా రహస్యం “ అనే పంథాకి తెర తీసినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
పీసీసీ అధ్యక్షుడిపై రహస్య సర్వే
తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడ్ని మార్చాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసం పలువురు సీనియర్ నాయకుల పేర్లు కూడా పరిశీలిస్తోందని సమాచారం. పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు దాసోజ్ శ్రవణ్, వీ.హనుమంతరావు వంటి వారు కూడా అధ్యక్ష పదవిపై కన్ను వేశారు. వారంతా తమ తమ స్థాయిల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగా కొత్త ఇన్ చార్జి మణిక్కం ఠాగూర్ మాత్రం పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం రహస్య సర్వే చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దూరమైన వర్గాలను చేరేందుకు..
గత పది సంవత్సరాలుగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి దూరమైన వర్గాలను చేరువ చేసేందుకు నూతన ఇన్ చార్జి తన ప్రయత్నాలను ప్రారంభించారని సమాచారం. ముఖ్యంగా పార్టీకి బీసీలతో పాటు దళితులు దూరమయ్యారని ఓ అంచనా. దీనికి కారణం పీసీసీ అధ్యక్షుడిగా కాని, ఇతర పదవుల్లో కాని ఆ వర్గాల వారికి అవకాశాలు కల్పించకపోవడమే అంటున్నారు.
దీంతో ఈ విషయంపై నూతన ఇన్ చార్జి మణిక్కం ఠాగూర్ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. పార్టీకి దూరమైన వర్గాలను తిరిగి పార్టీకి చేరువ చేయడం, పార్టీలో సీనియర్లందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం కోసం మణిక్కం ఠాగూర్ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు.
ఇందులో భాగంగా రెండు రోజులుగా దళిత, బీసీ వర్గాలకు చెందిన నాయకులను నేరుగా కలుస్తున్న మణిక్కం ఠాగూర్ వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని చెబుతున్నారు. పార్టీ పటిష్టం కోసం ఇన్ని చర్చలు తీసుకుంటున్నా… సీనియర్లు సహకరిస్తారా లేక యథావిధిగా గ్రూపుల్లో మునిగిపోతారా అన్నది ఇంకా ప్రశ్నార్ధకమే.










