అమరావతి చుట్టూ సినిమా రాజకీయం అల్లుకుపోతోంది. సినీ నటుడు కృష్ణంరాజు, నిర్మాత సి. అశ్వీనదత్ లు తమ భూములకు నష్టపరిహారం కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ కోసం వీరు భూములు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. ప్రభుత్వం ఇంతవరకు ఆ భూములకు సంబంధించి ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. నటుడు కృష్ణంరాజు 31 ఎకరాలు, అశ్వనీదత్ 39 ఎకరాలు ఇచ్చారు. ఈ భూములకు నష్టపరిహారం రాకపోవడంతో వీరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను పరిశీలించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చే సోమవారం ఈ అంశం విచారణకు రానుంది.
2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని వీరు కోరుతున్నారు. ఈ భూమి విలువ ఎకరాకు 1.54 కోట్ల విలువ ఉంటుంది. అంతే విలువైన భూమిని ప్రతిపాదిత రాజధాని అమరావతి లో వీరికి కేటాయిస్తామని అప్పటి సీఆర్ డీఏ అంగీకరించింది. ప్రస్తుతం రాజధాని తరలింపు తెరపైకి వచ్చింది. దీంతో అక్కడ భూమి విలువ 30 లక్షలకు పడిపోయింది. అందువల్ల తమకు ఆ భూములు అవసరం లేదని, తమ భూములకు నష్టపరిహారం మాత్రమే చెల్లించాలని వీరు కోరుతున్నారు. తన 39 ఎకరాలకు రూ. 210 కోట్లు చెల్లించాలని అశ్వనీదత్ డిమాండు చేస్తున్నారు.
ఈ భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎకరా రూ. 1.84 లక్షలకు చేరుకుందని, దీనికి నాలుగు రెట్లు అదనంగా చెల్లించి ఆ భూములు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. తనకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ఎయిర్ పోర్ట్ అధారిటి ఆఫ్ ఇండియా, రాష్ర్ట ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చని తన పిటిషన్ లో అశ్వనీదత్ పేర్కొన్నారు. అశ్వనీదత్ తరఫున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఈ పిటిషన్ వేశారు. నష్టపరిహారం ఇవ్వకుంటే తన భూములను తిరిగి తనకు అప్పగించాలని దత్ కోరుతున్నారు.











