ఇటీవలి కాలంలో ఏపీ సీఐడీ అధికారులు పలువురికి విచారణ పేరిట నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీఐడీ అధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేస్తూ, విచారణ అంటూ వేధింపులతో అరాచకం సృష్టిస్తున్నారని హైకోర్టు మండిపడింది. ప్రజలు ‘ఖాకిస్టోక్రసీ’లో బతుకుతున్నామనే భయానికి గురి చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఖాకిస్వామ్యంలో ఉన్నామా? అంటూ వ్యాఖ్యలు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాన్ని ప్రచురించిన వెబ్ సైట్ నడుపుతున్న వ్యక్తిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులను నమోదు చేసే క్రమంలో సీఐడీ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారని హైకోర్టు అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా ఓ ఆడియో క్లిప్ వెబ్ సైట్ లో ఉందంటూ ప్రతూరి జగదీశ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు తెలుగువన్.కామ్ ఎండీ కంఠమనేని రవిశంకర్ పై ఐపీసీ సెక్షన్ల కింద 188, 505(2), 506 కేసులు నమోదు చేశారు. వీటితో బాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 54 కింద కేసును నమోదు చేశారు.
జరిగిన దానికి పెట్టిన కేసులకు ఏమైనా సంబందం ఉందా?
తనపై నమోదయిన కేసుకు సీఐడీ అధికారులు పెట్టిన సెక్షన్లకు ఎటువంటి సంబంధం లేదని రవిశంకర్ హైకోర్టులో ఫిర్యాదు చేసారు. ఆయా సెక్షన్లకు తమ కేసుకు సంబంధం లేదని విచారణ సందర్బంగా రవిశంకర్ తరుపు న్యాయవాది వాదనలను వినిపించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద నమోదయిన కేసు భయాన్ని కలిగిస్తోందని హైకోర్టుకి విజ్ఞప్తి చేశారు. సంబందం లేని కేసులను తమపై మోపడం ద్వారా సీఐడీ అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలారంటూ దీంతో తమపై నమోదయిన కేసును కొట్టివేయాలని ఆయన కోరారు.
సింగిల్ బెంచ్ ధర్మాసనం ఎం సత్యనారాయణ మూర్తి ఈ కేసును విచారణకు స్వీకరించారు. వివిధ సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ పోలీసులకు తమ విధులను ఆయన గుర్తు చేశారు. రవిశంకర్ పై నమోదయిన కేసులు ఇల్లీగల్ గా గుర్తించిన న్యాయమూర్తి సీఐడీ అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కేసు పెట్టారని వ్యాఖ్యలు చేశారు. రవిశంకర్ పై నమోదయిన కేసులకు ఆయనపై పెట్టిన సెక్షన్లకు ఎటువంటి సంబందం లేదని స్పష్టం చేస్తూ కేసును కొట్టివేశారు.