ఒక హీరోను లేదా హీరోయిన్ ను జనం ఆరాధిస్తే ఏకంగా గుళ్లు గోపురాలే కట్టేస్తారు. ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు విగ్రహాలు చాలా అలా ఏర్పాటైనవే. తాజాగా వైజాగ్ లో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటైంది. ఆయన అభిమానులు ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. దీని ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం వైజాగ్ లో నిర్వహించారు. విశాఖ నగరం నడిబొడ్డులోని డాబాగార్డెన్స్ కూడలిలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పలువురు శోభన్‌బాబు అభిమానులు అనేక మంది హాజరయ్యారు.
విగ్రహ నిర్మాణ కమిటీ, విశాఖపట్నం శోభన్‌బాబు ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విగ్రహ స్థల దాత ఎ.సతీష్ కుమార్, విగ్రహ దాత జె.రామాంజనేయులు, రాశీ మువీస్ అధినేత ఎం. నరసింహరావు, అఖిలభారత్ శోభన్ బాబు సేవాసమితి సభ్యులు పూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తొలుత వీరంతా శోభన్‌బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విగ్రహ ఆవిష్కరణ చేసిన జె.రామాంజనేయులతో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడిగా శోభన్‌బాబు ఎంతో గుర్తింపు పొందారన్నారు.
ఆరు అడుగుల అందగాడిగా, కుటుంబ చిత్రాల కథానాయకుడిగా ఎన్నో సినిమాల్లో ఆయన తెలుగు ప్రేక్షకులను మెప్పించగలిగారన్నారు. శోభన్ బాబు సినిమాల్లో సమాజానికి అవసరమైన సందేశం ఉండేదన్నారు. నాటి తరంతో పాటు నేటి తరం హిరోలకు శోభన్ బాబు ఆదర్శప్రాయుడిగా నిలిచారన్నారు. భౌతికంగా ఆయన లేక పోయినప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడు ఆయన చిరస్మరణీయుడిగా మిగిలిపోయారనికొనియాడారు. దేశ వ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాలు ఆయన పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శోభన్ బాబు మరణించి 15 సంవత్సరాలైంది.