ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీ ఎన్నికల సంఘానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలు జరపాల్సిందేనని ఎన్నికల కమిషన్ పట్టుదలతో ఉండగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఎన్నికలు ఒకేసారి జరపడం సాధ్యం కాదని, వాయిదా వేయాలని జగన్ సర్కారు చెబుతోంది. ఈ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరువాత.. సర్కారుకు అనుకూలంగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలపై ఎన్నికల సంఘం అప్పీల్‌కి వెళ్లింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై వైఎస్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఆ పిటిషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైంది. సర్కారు వేసిన మరో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారించనుంది. ఇక ఉద్యోగ సంఘాలూ ఎన్నికల నిర్వహణలో ప్రస్తుతం పాల్గొనలేమని, వాయిదా వేయాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పునకు అంతా కట్టుబడి ఉండాల్సిందే. ఆ తీర్పు వచ్చాక కూడా పునర్విచారణకు మాత్రం కొన్నిఅవకాశాలుంటాయి.
గుజరాత్‌లో శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠకు తెరలేపగా.. శనివారం ఇదే అంశానికి సంబంధించి మరో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడులైంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్కడ ఫిబ్రవరి 21,28 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఏపీలో జారీ అయిన నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 2 నుంచి నాలుగు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే రోజునే కౌంటింగ్ కూడా జరగనుంది.
గుజరాత్‌లో ఫిబ్రవరి 21, 28 తేదీల్లో..
కొవిడ్ వ్యాక్సిన్ నేపథ్యంలో గుజరాత్‌లో రెండు విడతల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆరు నగర పాలక సంస్థలు, 81 మున్సిపాల్టీలు, 31 జిల్లాపరిషత్‌లకు, 231 తాలూకా పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మీద ఇక్కడా దాదాపు 4.2కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలనే వినియోగించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల సంఖ్యను బట్టి అవసరమైతే ఇక్కడ ఈవీఎంలు వినియోగించాలా లేక బ్యాలెట్ వినియోగించాలో నిర్ణయిస్తామని ఆ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈవీఎంలు వాడినా.. వీవీప్యాట్‌లు వినియోగించే అవకాశం లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 47,695 పోలింగ్ బూత్‌లు ఉండగా అందులో 6వేల పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకంగా గుర్తించారు. మొత్తం మీద ఆరు నగరపాలక సంస్థల్లో 574 డివిజన్లకు, 80 పురపాలక సంఘాల్లోని 2720 కౌన్సిల్ స్థానాలకు, 9049 జిల్లా/తాలూకా ప్రజాప్రతినిధుల స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
అభ్యంతరాలు వచ్చినా..
కాగా గుజరాత్‌లోనూ కొన్ని అంశాల్లో ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలు వచ్చినా ఎన్నికల సంఘం మాత్రం షెడ్యూల్ విడుదల చేసింది. అదే సమయంలో గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పట్లో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కొందరు ప్రస్తావిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో జరిగిన వ్యవహారాన్నితెరపైకి తెస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో బీహార్ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారని, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కొవిడ్ ఎక్కువగా ఉన్నఈ టైంలోఎన్నికలు జరపడం సరికాదని, ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ అవినాశ్ ఠాకూర్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు కూడా నిరాకరించింది. నోటిఫికేషన్ వెలువడక ముందే ఈ పిటిషన్ దాఖలు చేయడం తొందరపాటుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయ పడింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించింది. అదే సమయంలో ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం అత్యవసర సమయంలో ఎన్నికలను వాయిదా వేయవచ్చని పిటిషనర్ చేసిన వాదనతో సుప్రీంకోర్టు విబేధిస్తూ.. ఎన్నికలు జరగకుండా ఆపలేమని వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది. ఇక గత డిసెంబరు 22, 27 తేదీల్లో కర్ణాటకలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయాన్ని గుజరాత్‌లో ఎన్నికలు జరపాలని కోరుతున్న నాయకులు తెరపైకి తెస్తున్నారు. గత డిసెంబరులో కర్ణాటకలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. 2.9 కోట్ల మంది ఓటర్లు పాల్గొనే 5,762 పంచాయతీల్లోని 82,616 వార్డులకు ఎన్నికలు జరగ్గా ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఒక్క బీదర్ జల్లాలోనే ఈవీఎంలు వాడారు. మిగతా అన్ని చోట్లా బ్యాలెట్ పేపర్లే వినియోగించారు.
మొత్తం మీద ఫిబ్రవరిలో ఏపీలో ఎన్నికలు జరపడాన్ని వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కొవిడ్ ఉన్న సమయంలోనే గత డిసెంబరులో పక్క రాష్ట్రమైన కర్ణాటకలో స్థానిక ఎన్నికలు జరగడం, అదే సమయంలో గుజరాత్‌లో అక్కడి ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంపై రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.