‘తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్’.. ఈ మాట ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రులు సైతం వరుస కట్టుకుని యువనేత ఆశీస్సులు తీసుకోవడంతో ఇది నిజమేనేమో అనే సందేహం కలుగుతోంది. ఇప్పుడా.. ఇంకెప్పుడా.. అనే విషయంపై చర్చ జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో కేటీఆర్ కేబినెట్‌లో కూర్చోబోయేది ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ఎవరికి వారే విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా… ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బెర్త్ ఖాయమనే సంకేతం వినిపిస్తోంది. ఇటీవలే కేటీఆర్ ఆయనతో రెండుగంటల పాటు ఏకాంతంగా చర్చించడంతో మంత్రి పదవి ఖరారైందనే వార్త హల్ చల్ చేస్తోంది!
ముహూర్తం ఖరారైందా?
ముఖ్యమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 18వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కొందరు మంత్రులు, కేటీఆర్‌కు సన్నిహితంగా మెలిగే ఎమ్మెల్యేలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు మరో అడుగు ముందుకేసి.. కేటీఆర్ సమక్షంలో ‘ కాబోయే ముఖ్యమంత్రికి రైల్వే, అసెంబ్లీ ఉద్యోగుల తరఫున శుభాకాంక్షలు… సీఎం కాగానే నేను సారథ్యం వహిస్తున్న రైల్వే ఎంప్లాయిస్ సమస్యలన్నీ పరిష్కరించాలి’ అని కోరేశారు. కేటీఆర్ సైతం చిరునవ్వుతో సరిపెట్టడంతో.. ‘యువనేత ముఖ్యమంత్రి’ అనే ప్రచారం నిజమేనేమో అనిపిస్తోంది.
Must Read ;- పట్టాభిషేకానికి మనసా, కర్మేణా సిద్ధమవుతున్న కేటీఆర్!

పొంగులేటిది చెరగని ముద్ర..
అవిభాజ్య ఖమ్మం జిల్లాలో అనతికాలంలోనే తనదైన గుర్తింపు తెచ్చుకున్న నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ వాదం బలంగా ఉన్న రోజుల్లో.. అతి తక్కువ సమయంలోనే వైఎస్సార్ సీపీలో చేరి ఎంపీగా గెలిచారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలను తన బుజస్కంధాలపై వేసుకుని గెలిపించారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో ఆయనకు టీఆర్ఎస్ సీటివ్వలేదు. దీంతో కొంత రాజకీయ సంక్షోభం నెలకొంది. పొంగులేటి కొంతకాలం స్తబ్దుగా ఉండిపోయారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలోకి వెళతారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్, బీజేపీ పెద్దలు సైతం రంగంలోకి దిగి.. పొంగులేటితో చర్చించారు. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు.
రెండుగంటల ఏకాంత భేటీ..
ఖమ్మంలో మూడుముక్కలాట నడుస్తోంది. అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాట నడుస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వైరం పెరిగింది. ఆ పంచాయితీ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే పొంగులేటిని శాంతింపజేసే పనిలో పడ్డారు యువనేత. ఇటీవలే ఖమ్మం పర్యటన సందర్భంగా కేటీఆర్.. పొంగులేటి ఇంటికెళ్లి ముచ్చటించారు. శనివారం సైతం హైదరాబాద్‌లో పొంగులేటితో యువనేత రెండుగంటల పాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. పొంగులేటితో పాటు ఆయన వర్గీయులు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్‌బాబు, కీలక నేతలు తెల్లం వెంకట్రావు, మట్టా దయానంద్ ఉన్నారు.
చిరకాల స్వప్నం నేరవేరబోతోందా?
మంత్రి పదవి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిరకాల స్వప్నం. గతంలో సైతం ఆయన అనేకసార్లు మంత్రి పదవి కోసం ప్రయత్నించినా అది వరించలేదు. ప్రస్తుతం కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే.. ఆ కేబినెట్‌లో పొంగులేటికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఏకాంత భేటీలో పొంగులేటికి కేటీఆర్ ఆ అభయమిచ్చినట్టు తెలుస్తోంది. ఇదే నియమైతే శ్రీనివాసరెడ్డికి మహర్దశ పట్టినట్టే! ఆయన్నే నమ్ముకుని ఉన్న వర్గానికి న్యాయం జరిగినట్టే!?
Also Raed ;- కేటీఆర్‌ను సీఎం చేసేందుకే.. కేసీఆర్ కాళేశ్వరం వెళ్లారా?











