పాన్ ఇండియా సినిమా అనే పదం ‘ బాహు బలి ‘ తర్వాత పాపులర్ అయింది కానీ తెలుగు సినిమా తొలి దశ నుంచే ఇతర భాషల్లోకి వెళ్ళింది. ఎన్టీఆర్ నటించిన ‘పాతాళ భైరవీ ‘ హిందీలో డబ్ అయింది . ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ ఈ సినిమాని ప్రదర్శించారు . అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి నటించిన ‘సువర్ణ సుందరి ” హిందీలోనూ అదేసమయంలో తీశారు . ఆ సినిమా ఏడాదికి పైగా ఆడింది. ఇక జెమినీ సంస్థ తీసిన ‘చంద్ర లేఖ ‘ అయితే తెలుగు , హిందీలో కూడా సంచలన విజయం సాధించింది .
ఈ మధ్య కాలం లో ‘ బాహుబలి ‘ తో పాన్ ఇండియా సినిమా అనే క్రేజ్ పెరిగింది . అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న సంగతి ఏమిటంటే 9 శతాబ్దాల తెలుగు సినిమా చరిత్రని గమనిస్తే జానపద చిత్రాలు లేదా ఫాంటసీ సినిమాలు మాత్రమే ఇతర భాషల ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తప్ప హిస్టారికల్ సినిమాలు కావు. ఉదాహరణకి సూపర్ స్టార్ కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా విదేశీ భాషల్లోకి అనువాదమౌ విజయం సాధించింది. అదే ‘అల్లూరి సీతా రామరాజు’ సినిమా వేరే భాషల్లోకి వెళ్ళ లేదు. ఆ మధ్య వచ్చిన ‘ రుద్రమ దేవి ‘ సినిమా తెలుగులో తప్పితే తమిళ , హిందీ , మలయాళ భాషల్లో సక్సెస్ కాలేదు .
మళయాళంలో సంతోష్ శివన్ వాస్కోడిగామా గురించి ‘ఉరుమి ‘ అనే సినిమా తీశారు. ఇతర భాషల్లో ప్లాప్.
అలాగే హిందీలో ‘ మంగళ్ పాండే ‘ , ‘థగ్స్ అఫ్ హిందూస్తాన్’ , ‘ మణి కర్ణిక ‘ తదితర సినిమాలు , మలయాళం లో ‘ మామాంగమ్ ‘, తెలుగులో వచ్చిన ‘ సైరా నరసింహారెడ్డి ‘ … ఇవన్నీ హిస్టారికల్ సినిమాలే ! వీటిలో ఏవీ దేశ వ్యాప్తంగా ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోయాయి . కేవలం జానపద కథలు , పౌరాణిక సినిమాలు మాత్రమే వైడ్ రీచ్ కి వెళ్లే అవకాశాలున్నాయి . చారిత్రక కథలు తీసుకున్నప్పుడు , ఆ ప్రాంతం వాళ్ళకి తప్పితే వేరే వారికి ఏ మేరకు నచ్చుతాయో చెప్పడం కష్టం.