జీవీఎల్ నరసింహారావు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొన్న అసలు సిసలు బీజేపీ వాది. దక్షిణాదిలో అందునా ఏపీకి చెందిన నాయకుడు కావడంతో ఆయనను బీజేపీ పార్టీ కూడా పలు కీలక పదవులను, బాధ్యతలను అప్పగించింది. తమతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన టీడీపీని మూడు నీళ్ల చెరువులు తాగించిన ఘనత ఆయన సొంతం. అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా టీడీపీని ఆయన వదలడం లేదు. తాజాగా చంద్రబాబును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అమరావతి నుంచి ఏ అంశంలోనైనా ఏపీ ప్రభుత్వ స్టాండ్ నే తమ విధానమనే పద్దతిలో ఆయన సమావేశాలు సాగుతుంటాయి.
రాష్ట్ర రాజధాని కోసం మంచి ఉద్దేశంతో భూములు ఇచ్చిన రైతులకు మద్దతుగా టీడీపీ, బీజేపీలోని కొందరు నాయకులు ప్రయతిస్తున్నారు. కానీ జీవిఎల్ అందుకు విరుద్ధంగా రాష్ట్ర రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని పలుమార్లు స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్లు గానే కేంద్రం కూడా ఏపీ హైకోర్టు కిచ్చిన అఫిడవిట్ లో ఇదే విషయాన్ని తెలిపిన సంగతి తెలిసిందే. ఏదయినా విషయంలో తానొక్కడినే బీజేపీకి అధికార ప్రతినిధినని తేల్చి చెప్పిన ఆయన తాను చెప్పిందే పార్టీ లైన్ అని స్పష్టం చేశారు.
దీంతో జీవీఎల్ పై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సరికొత్త విషయాన్ని వెలుగులోకి వచ్చింది. జీవిఎల్ నరసింహారావుకు ఏపీ సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ కు బంధుత్వం ఉందనే విషయం బయటికి వచ్చింది. బ్రదర్ అనిల్ కుమార్ కు చుట్టం కావడంతో జీవిఎల్ వైసీపీ పాట పాడుతున్నాడని విమర్శలు చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓ అడుగు ముందుకేసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇదే విషయాన్ని పేర్కొన్నారు. బ్రదర్ అనిల్ కుమార్ మేనత్త కుమారుడే జీవిఎల్ అని ఆయన విమర్శలు చేశారు. దీంతో పలు టీవీ ఛానళ్ళు ఇదే అంశాన్ని చర్చా వేదికలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో స్పందించిన జీవిఎల్ తనకు అనిల్ కుమార్ కు ఎటువంటి సంబందం లేదని తేల్చిచెప్పారు. టీడీపీ మీడియాని తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా గ్రూపులపై ఆయన సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. జీవిఎల్ పై టీడీపీ నాయకులు ఇంతలా మండిపడటానికి కారణమేంటనే చర్చ రాష్ట్రంలో ఓ రేంజ్ లో జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధానికి లేఖ వ్రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై స్పందించిన జీవిఎల్ లేఖపై కేంద్రం స్పందించిందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో 14 ఏళ్ల పాటు చంద్రబాబుపై కేసులపై స్టే ఎలా విధిస్తారని ఇది గిన్నిస్ బుక్ రికార్డు అని ఎద్దేవా చేశాడు. దీంతో టీడీపీ నాయకులు జీవిఎల్ పై ఫైర్ అవుతూ ఇలాంటి కామెంట్స్ చేసినట్లు అర్ధమవుతోంది. మొత్తం మీద బీజేపీ-టీడీపీ నాయకుల సంవాదం వైసీపీకి ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పక తప్పదు!!










