జాతీయ గణాంకాల కార్యాలయం దేశ వ్యాప్తంగా విద్యావిధానాలపై ఓ సర్వేని నిర్వహించింది. 2017 జులై నుంచి 2018 జూన్ వరకు నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీలో అక్షరాస్యత శాతం 67.4 గా ఉండేది. 2018 నాటికీ 66.4 శాతానికి పడిపోయిందని ఈ సర్వే తెలిపింది. జాతీయ సగటు 77.7 శాతం ఉండగా ఏపీలో విద్యాశాతం తగ్గిపోవడంపై మేధావులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 96.2 శాతంతో కేరళ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఢిల్లీ ఉంది. తెలంగాణలో 72.8 శాతం ఉండగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న బీహార్ లో 70.9 శాతం నమోదు కావడం గమనార్హం. పెద్ద పెద్ద రాష్ట్రాల కంటే చిన్న చిన్న రాష్ట్రాలతోనే అక్షరాస్యత విషయంలో ముందంజలో ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది.
సర్వే ఫలితాల ప్రకారం ఏపీలోని పట్టణాలలో అక్షరాస్యత విషయంలో పల్లెల కంటే మెరుగుగా ఉన్నాయని తేలింది. పట్టణాలలో 79.6 అక్షరాస్యత శాతం ఉండగా పల్లెలలో దారుణంగా 60.5 శాతం ఉన్నట్లు తేలింది. ఇంత దారుణంగా అక్షరాస్యత శాతం పడిపోవడానికి కారణం చంద్రబాబు అంటూ వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ సర్వే ఫలితాలను ఉపయోగించుకుంటూ ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలే కారణమని తప్పుపడుతున్నారు. పిల్లలను స్కూల్ కు పంపేలా అమ్మబడి, నాడు నేడు లాంటి విధానాల ద్వారా ఏపీలో అక్షరాస్యత శాతం పెంచుతామని వైసీపీ నాయకులు చెబుతున్నారు. వైఫల్యాలను అధిగమిస్తూ నిర్ణయాలు తీసుకుంటే మంచిదే కానీ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే వచ్చే లాభమే లేదు. అమ్మబడి, నాడు నేడు లాంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ఏపీ అక్షరాస్యత శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుకుంటున్నారు.











