దర్శకుడు శంకర్ కు ప్రభుత్వం కేటాయించిన భూముల వ్యవహారానికి ఈరోజు హైకోర్టులో చుక్కెదురైంది. రూ. 2.5 కోట్ల భూమిని రూ. 25 లక్షలకు ఎలా కేటాయిస్తారని తెలంగాణ హైకోర్టు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దర్శకుడు శంకర్ కు భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. రూ.2.5 కోట్ల ఖరీదైన భూమిని రూ. 25 లక్షలకు ఎలా కేటాయిస్తారని కోర్టు ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలక పాత్ర పోషించారని ఏజీ కోర్టుకు వివరణ ఇచ్చారు. దానికి కోర్టు తెలంగాణ కోసం త్యాగం చేసిన వేల మందికి ఇలాగే ఇస్తారా అని ప్రశ్నించింది.
హైదరాబాదులో ఇప్పటికే అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ ఉందన్న విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా అని కూడా ప్రశ్నించింది. ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని పేర్కొంది. ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇవ్వరాదని సూచించింది. కేబినెట్ నిర్ణయాలకు సహేతుకత ఉండాలని పేర్కొంది. కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు కోరడంతో కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.











