ఆంధ్రప్రదేశ్ లోని వేర్వేరు ప్రాంతాల్లో తమ మూలాలు కలిగిఉండి, హైదరాబాదులో స్థిరపడిన వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. సుమారు 74 లక్షల ఓట్లున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో- ఆంధ్రోళ్లు ఎన్ని లక్షల మంది ఉంటారనేది ఇదమిత్థంగా తేల్చి చెప్పలేం గానీ.. దాదాపుగా వంద డివిజన్లలో గెలుపోటముల్ని ప్రభావితం చేయగల స్థాయిలో ఉంటారనేది మాత్రం నిజం. అందుకే దాదాపుగా అన్ని పార్టీలు కూడా ఆంధ్రోళ్ల ఓట్ల మీద కాస్తంత స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. అయితే వారి మనోగతం ఎలా ఉంటుందనేదే ప్రశ్న.
సాధారణంగా మునిసిపల్ ఎన్నికలు లాంటివి అంటే.. డివిజన్లకు పోటీచేసే అభ్యర్థి స్థానికంగా ప్రజలందరికీ బాగా తెలిసిన వాడే అయి ఉంటారు. పార్టీ కంటె అభ్యర్థి ప్రాతిపదికగానే ఈ ఎన్నికలు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా మారిపోయాయి. అభ్యర్థులకంటే పార్టీల ప్రాబల్యం పెరిగింది. పైగా హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రోళ్లకు ఇక్కడి అభ్యర్థులతో ఉండగల పరిచయాలు కూడా బాగా తక్కువ. ఇన్ని కాంబినేషన్స్ మధ్యలో వారి ఆలోచనలు ఎవరికి అనుకూలంగా ఉంటాయనేది ప్రశ్న.
కేసీఆర్ కూడా ఈ ఓట్ల మీద ఈసారి ప్రత్యేకంగా కన్నేశారనే అభిప్రాయమే పలువురిలో కలుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో కేసీఆర్ నగర ఎన్నికలకు జాగ్రత్త పడ్డారు. భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. రోడ్ షోలు స్వయంగా చేయకపోయినా.. ఆ స్థాయిలోనే ప్రచారాన్ని నడిపించారు. అయితే ఆయన ఎల్బీస్టేడియం ప్రసంగంలో ఆంధ్రోళ్లు అనే మాట కూడా వాడకపోవడం వారి మీద నింద వేయకపోవడం చర్చనీయాంశం అయింది. ఆ పదం వాడుతూ ఎడాపెడా నిందలు వేయడం కేసీఆర్ మార్కు ప్రసంగాలుగా గతంలో ముద్ర పడింది. ఆ ఓటు బ్యాంకును దూరం చేసుకోకుండా ఉండడానికే జాగ్రత్తగా మాట్లాడారనే చర్చ జరిగింది.
ఆంధ్రోళ్ల ఓట్ల కోసం టీఆర్ఎస్ ప్రయత్నాలకు ఇంకో వాదన కూడా జత చేరింది. బల్దియా ఎన్నికల్లో ఈసారి వైఎస్సార్ సీపీ నాయకులు పోటీచేయాలని అనుకున్నారని, వారు జగన్‌ను, లేదా ఆ పార్టీ పెద్దలను సంప్రదించారని అటునుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని ప్రచారం జరిగింది. అయితే.. వైసీపీ, జగన్ అభిమానులు తమ తమ సోషల్ మీడియాల ద్వారా తెరాస అనుకూల ప్రచారమే నిర్వహించారు. వారిలో ఎక్కువమంది ఆంధ్రోళ్లే అయిఉంటారు కూడా.
తెదేపా నామమాత్రమే అయినా..
అదే సమయంలో తెలుగుదేశం పార్టీ.. నగరంలోని ఆంధ్రోళ్లంతా తమ పార్టీనే సొంత పార్టీగా భావిస్తారనే భావనలో ఉంది. నిజానికి ఈ ఎన్నికల్లో అధికారంలోకి రాగల, పార్టీ బలాన్ని నిరూపించుకోగల అవకాశం తెలుగుదేశానికి లేదు గానీ.. అస్తిత్వ నిరూపణ కోసం బరిలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ లో బాగా బలమైన పార్టీ గనుక.. ఇక్కడి ఆంధ్రా ఓట్లు తమవే అవుతాయని వారు అనుకున్నా అతిశయోక్తి కాదు.
బీజేపీ సంగతి ఏంటి?
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉనికిలో ఉన్న పార్టీగా ముద్రపడిన జనసేన.. తెలంగాణలో కూడా తాము ఉన్నాం అని చెప్పుకోడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందనే ప్రచారం బాగా జరిగింది. బీజేపీ పెద్దలు- పవన్ ను కలిసి.. పార్టీ పోటీనుంచి తప్పుకునేలా ఒప్పించారు. అయితే కింది స్థాయి నాయకులు.. అసలు జనసేనకు అంత బలమెక్కడుంది అంటూ ఎద్దేవా చేశారు! ఇన్‌డోర్‌లో బతిమాలి, అవుట్‌డోర్‌లో వెక్కిరించినట్లుగా తయారైంది పరిస్థితి. అయితే పవన్ కల్యాణ్ తో పొత్తుఉన్న కూటమి పార్టీ గనుక.. ఆంధ్రా వాళ్లు ఉంటే తమను ఆదరిస్తారనే అభిప్రాయం బీజేపీలో ఉండొచ్చు.
ఆంధ్రా ఓటర్లు ఆలోచించుకోరా?
గంపగుత్తగా చూసినప్పుడు.. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేంత పెద్ద ఓటు బ్యాంకు ఆంధ్రా ఓట్లకు ఉండవచ్చు గానీ.. వారందరూ ఒకే పార్టీకి, ఒకే వర్గానికి కట్టుబడి ఉంటారని అనుకోవడం భ్రమ. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పార్టీలకు ఆదరణ ఉంటుందో.. ఇక్కడ కూడా అదే దామాషాలో ఉంటాయి. అయితే.. బీజేపీకి ఓట్లు వేసే విషయంలో మాత్రం ఆంధ్రా ఓటర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే అవకాశం ఉంది. అదే క్రమంలో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పట్ల కూడా వారు విముఖంగానే ఉంటారు. కాంగ్రెస్ కు వారి మనసులు గెలుచుకోవాలనే ఆశ కూడా లేదు. కాకపోతే బీజేపీ మాత్రం సెటిలర్ల ఓట్లు కూడా ఆశిస్తున్నది గానీ.. సాధ్యమేనా అనేది సందేహం.
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని ద్రోహం చేసిందనే అభిప్రాయం అక్కడి ప్రజలందరిలోనూ ఉంది. ప్రత్యేకహోదా ఇవ్వకుండా చేసిన మోసం ఇప్పట్లో ప్రజలు మర్చిపోయేది కాదు. పోలవరం విషయంలో ఇప్పటికీ కేంద్రప్రభుత్వం ఎన్ని నాటకాలు ఆడుతున్నదో కూడా వారు గమనిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే 2019 ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో పార్టీని దారుణంగా ఓడించి ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ కు తమ వంతు బాధ్యతగా నెరవేర్చాల్సిన హామీల విషయంలో ఏపీ బీజేపీ.. నాటకాలు ఆడుతూనే ఉంది. దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు సాధించిన విజయాన్ని, బీజేపీకి ప్రజలు పడుతున్న బ్రహ్మరథంగా చూపించుకుని.. ఆంధ్రలో కూడా పాగా వేయాలని వారు అనుకుంటున్నారు. అందుకు అనుకూలంగా వారికోసం తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రాంతం నుంచి హైదరాబాదులో సెటిలైన వారు బీజేపీని క్షమిస్తారా? తమ సొంత ప్రాంతానికి చేసిన, చేస్తున్న ద్రోహాల్ని విస్మరిస్తారా? లేదా అనేది ఈ ఎన్నికల్లో తేలుతుంది.
.. సురేష్ పిళ్లె











