మలయాళ చిత్రాల్లో ఓవర్ డ్రామా, మెలో డ్రామాలుండవు. కథకు కావల్సినంత మోతాదులోనే డ్రామా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఎమోషన్స్ ను కొలత కొలిచినట్టుగా పలికిస్తారు నటీనటులు. మాలీవుడ్ లో సూపర్ హిట్టైన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ‘వరనే ఆవశ్యముండు’ (వరుడు కావాలి) ఈ కోవలోని సినిమానే. దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్, శోభన, సురేశ్ గోపీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
కథేంటి?: నీనా భర్త నుంచి విడిపోయి కూతురు నిక్కితో చెన్నైలోని తన అన్నగారింటికి దగ్గరలోని ఓ ఫ్లాట్ లో నివసిస్తూ ఉంటుంది. ఫ్రెంచ్ ట్యూషన్స్ , క్లాసికల్ డ్యాన్స్ ను తన జీవనాధారంగా చేసుకుంటుంది. అయితే అదే ఫ్లాట్ లో రిటైర్డ్ మేజర్ ఉన్నికృష్ణన్ ఒంటరిగా జీవిస్తుంటాడు. ఆయన యాంగర్ మేనేజ్ మెంట్ ప్రాబ్లెమ్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఉంటాడు. మరో ఫ్లాట్ లో బిబీష్, అతడి తమ్ముడు ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఇంట్లో ఉంటారు. అయితే కొద్ది రోజులకు ఉన్నికృష్ణన్ మీద నీనాకి ఇష్టం పెరుగుతూ ఉంటుంది.
ఉన్ని కృష్ణన్ కూడా నీనా మీద అభిమానం పెంచుకుంటాడు. వీరిద్దరి గురించి ఫ్లాట్ లో వాళ్ళు రకరకాల రూమర్స్ పట్టిస్తారు. అయితే దాన్ని నీనా ఖండించే ప్రయత్నం చేయదు. దాంతో తల్లి మీద నిక్కికి కోపం పెరిగి.. అది అయిష్టంగా మారుతుంది. ఇదిలా ఉండగా.. బిబీష్ తో నిక్కీ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరూ తమ లవర్స్ విషయయంలో దెబ్బతిన్నారు కాబట్టి.. ఆ ఇద్దరూ కనెక్ట్ అవ్వాడానికి ఎంతో సమయం పట్టదు. తనంటే అయిష్టం పెంచుకున్న కూతురికి ఉన్నికృష్ణన్ మీద సాఫ్ట్ కార్నర్ పెరిగేలా ఆమె మనుసు మార్చి.. తనకో తోడు కోసం ఉన్నికృష్ణన్ తో నీనా తన జీవితం పంచుకోవడమే మిగతా కథ.
ఎలా తీశారు? : ఒకే ఫ్లాట్ లోని మూడు కుటుంబాలు.. ఒకొక్కరికీ ఒకో సమస్య. నీనా భర్త నుంచి విడిపోయి.. తన కూతురితో బ్రతుకుతూ.. ఒక తోడు కోసం పరితపించే సమస్య. నిక్కీకి బాయ్ ఫ్రెండ్ నుంచి విడిపోయిన సమస్య. సీరియల్ నటీమణికి కూడా ఓ కుటుంబ సమస్య.. ఇద్దరు పిల్లల్నిచూసే బాధ్యత. మేజర్ ఉన్నికృష్ణన్ కు భార్య చనిపోయి ఒంటరిగా జీవిస్తూ.. యాంగర్ మేనేజ్ మెంట్ తో బాధపడే సమస్య. ఈ సమస్యలన్నిటికీ చక్కటి ఎమోషన్స్ తో పరిష్కార మార్గం చూపించే దిశగా మంచి డ్రామాను వారిపై రన్ చేసి .. ఆసక్తి కరమైన సీన్స్ తో సినిమాను తెరకెక్కించాడు కొత్త దర్శకుడు అనూప్ సత్యన్ (ఫేమస్ మలయాళ దర్శకుడు సత్యన్ అత్తిక్కడ్ కొడుకు ).
అయితే ఈ సినిమా టైటిల్ ను బట్టి చూస్తే .. టైటిల్ రోల్ శోభన కే వర్తిస్తుంది. దానికి తగ్గట్టుగానే శోభన, సురేష్ గోపీల లవ్ ట్రాక్ నే ఎక్కువ ఫోకస్ చేశాడు దర్శకుడు. దుల్కర్, కళ్యాణీల ప్రేమకథను దానికి పేర్లల్ గా నడిపిస్తాడు. నీనాగా శోభన, నిక్కీగా కళ్యాణి ప్రియదర్శిని, రిటైర్డ్ మేజర్ గా సురేష్ గోపి, బిబీష్ గా దుల్కర్ సల్మాన్ .. ఎవరిపాత్రలను వారు అద్భుతంగా పోషించారు.
హైలైట్స్ : శోభన, సురేష్ గోపి పాత్రల మీద మంచి ఫీల్ గుడ్ సీన్స్ ను రన్ చేశాడు దర్శకుడు. సురేష్ గోపీని కాస్త బిడియస్తుడుగానూ, శోభన ను యాక్టివ్ పార్ట్ తీసుకొనే పాత్రగానూ చూపించడం ఆకట్టుకుంటుంది. ఒక స్త్రీకి ఎంత వయసు వచ్చినప్పటికీ జీవించడానికి నీడలాంటి ఒక తోడు అవసరం అన్న సంగతి చాలా చక్కగా చెప్పాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం మెప్పిస్తుంది. దాదాపు ఏడేళ్ళ తర్వాత మళ్లీ మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శోభన అదరగొట్టింది. అలాగే సురేష్ గోపీ కూడా ఇది రీ ఎంట్రీనే . అయినా తన పాత్రలో జీవించాడు.
నటీనటులు : శోభన, సురేష్ గోపీ, దుల్కర్ సల్మాన్, కళ్యాణీ ప్రియదర్శిని, కె.పీ.లలిత, లాలూ అలెక్స్ తదితరులు
నిర్మాణం : దుల్కర్ సల్మాన్
దర్శకత్వం : అనూప్ సత్యన్
ఎక్కడ చూడాలి?: నెట్ ఫ్లిక్స్
ఒక్కమాటలో : ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీ
భాష : మాలయాళం
రేటింగ్ : 3.5 /5
-ఆర్కే











