ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక అధికార పార్టీ వైసీపీకి ముచ్చెమటలు పట్టించడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ టికెట్‌పై 2019 ఎన్నికల్లో బద్వేలు ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటసుబ్బయ్య అనారోగ్య కారణాలతో మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ నెల 30న జగనున్న ఈ ఎన్నికకు సంబంధించి వెంకబసుబ్బయ్య సతీమణినే తమ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించడంతో.. చనిపోయిన అభ్యర్థి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే.. పోటీ చేయరాదన్న సంప్రదాయాన్ని గౌరవిస్తూ టీడీపీ, జనసేన పోటీ నుంచి తప్పుకున్నాయి. అయితే బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా ప్రకటించడంతో పాటుగా తమ అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ఈ రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పోటీలో లేని టీడీపీ, జనసేన ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే.. ఆ పార్టీకి భారీగా ఓట్లు పడే అవకాశాలున్నాయన్న అంచనాలను క్యాష్ చేసుకునేలా బీజేపీ చాప కింద నీరులా దూసుకుపోతోంది. టీడీపీ ఓట్లతో పాటుగా వైసీపీలోని అసంతృప్తనేతలకు కూడా గేలం వేస్తూ సాగుతున్న బీజేపీ.. ఎన్నికల్లో జగన్ పార్టీకి షాకిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వైసీపీ నుంచి బీజేపీలోకి..
బద్వేలు ఉప ఎన్నిక వైసీపీకి అంత ఈజీ కాదన్న వాదనలకు బలం చేకూరుస్తూ శనివారం నాడు బద్వేలులో ఓ కీలక ఘటన చోటుచేసుకుంది. వైసీపీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు సమక్షంలో కమలం పార్టీలో చేరిపోయారు. వీరందరికీ సోము వీర్రాజు కాషాయ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ ‘‘బద్వేలు లో భూ కబ్జాలు పెరిగిపోయాయి, శుక్రవారం నాడు వైశ్యుల కుటుంబానికి చెందిన స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేశారు. ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి. వైసీపీ నేతలు సామాన్యుల స్థలాలు కూడా కబ్జా చేస్తున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. బద్వేలు లో భూ కబ్జా దారులు రెచ్చిపోతున్నారు. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక తాడేపల్లి నుంచి బయటికి రావడం లేదు. మోడీ వేసిన రోడ్ల పై జగన్ తిరగాలి. పల్లెల్లో రోడ్లు అద్వాన్నంగా తయారయ్యాయి. జగన్ పల్లెల్లో రోడ్లు వేయలేదు. మోడీ వేసిన రోడ్లు, జగన్ వేసిన రోడ్లకి చాలా వ్యత్యాసం ఉంది. వైసీపీ పాలన తో ప్రజలు విసిగిపోయారు’’ అని వీర్రాజు విరుచుకుపడ్డారు.
పెరుగుతున్న వ్యతిరేకత
జగన్ సర్కారుపై జనంలో అంతకంతకూ వ్యతిరేకత పెరుగుతోంది. ఈ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకునే అవకాశం ఉన్న టీడీపీ బరిలో దిగలేదు. అయితే టీడీపీతో గతంలో పలుమార్లు జట్టు కట్టి బరిలోకి దిగిన బీజేపీ మాత్రం బద్వేలు బరిలో ఉంది. వెరసి పెరిగిపోతున్న వ్యతిరేక ఓటు మొత్తం బీజేపీ ఖాతాలోనే జమ అయ్యే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ కార్యాలయాలపై దాడుల కారణంగానే వైసీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. జిల్లాల్లో అంతకంతకూ వైసీపీని వీడుతున్న నేతలు చాలా మందే కనిపిస్తున్నారు. వీరంతా బద్వేలులో వైసీపీ ఓటమికి పనిచేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే.. బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ విక్టరీ ఈజీనేనన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.