అసలే కరోనా సీజను. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఇంకా జాగ్రత్తల మధ్యలోనే బతుకుతున్న వాళ్లు అనేకులు ఉన్నారు. పొట్టకూటికోసం వేరే గతిలేక పనులకు బయటకు వెళ్తున్న వారు కూడా బోలెడు జాగ్రత్తలు తీసుకుంటూ బతుకీడుస్తున్నారు. అయితే.. కొందరికి మాత్రం.. ఇప్పటికీ కరోనా అంటే భయం లేదు. కెమెరాలు కనిపిస్తే కరోనా జాగ్రత్తల గురించి నీతులు వల్లిస్తారు గానీ.. ఆ జాగ్రత్తలను తాము పాటించాలనే స్పృహలేదు. ఎడాపెడా పార్టీలకు ఎగబడ్డారు. తెగబడ్డారు. అందుకే ఇప్పుడు భాగ్యనగరంలో వివిధ వర్గాలకు చెందిన అనేక మంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారని సమాచారం.
అనగనగా భీమవరానికి చెందిన ఒక రాజుగారు! ఆయన ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీకి యజమాని. ఆ రకంగా బోలెడు రిచ్ కూడా! సహజంగానే ఆ స్థాయి ప్రముఖులతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. అనగా సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో అనేక మంది యువ సెలబ్రిటీలు ఆయనకు బాగా క్లోజ్! అలాంటి రాజుగారికి ఇటీవల బర్త్ డే వచ్చింది.
రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్న సామెత చందంగా.. రాజుగారు తలచుకుంటే పార్టీలకు కొదవా? ఉండదు కద! కానీ.. కరోనా అనే మహమ్మారి పొంచి ఉందనే భయం వారికి ఉండాలి కదా! ఆ భయం లేకపోగా.. అందరినీ పిలిచి చాలా గ్రాండ్ స్కేల్ లో పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. మందు విందు చిందులన్నీ కలగలిపిన భారీ పార్టీ. హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో దాదాపు వందమందికి పైగా ప్రముఖులు వచ్చినట్లు సమాచారం.
అందులో కనీసం 20 మందికి ఇప్పటిదాకా కరోనా పాజిటివ్ గా తేలింది. ఇంకా ఎందరికి పాజిటివ్ వస్తుందో తెలియదు. ఈ ఇరవై మందిలో.. సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. అన్నదమ్ములయ్యే ప్రముఖులు కూడా ఉన్నారు. వారికి పాజిటివ్ అనే వార్త మీడియాలో వైరల్ గా రాగానే, ‘అరె! వాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా.. వాళ్ల ఫ్యామిలీలో ఇటీవలే కరోనా వచ్చింది కదా.. వచ్చిన తర్వాతనైనా వీరు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి కదా’ అని ప్రజలు ఆశ్చర్యపోయారు.
కానీ విషయం ఏంటంటే.. వీళ్లందరూ ఈ భీమవరం సాఫ్ట్ వేర్ దిగ్గజం రాజుగారి పార్టీకి వెళ్లి అంటించుకున్నారు. ఏదో షూటింగుకు, పని మీద వెళ్లినందుకు అంటుకోలేదు. విలాసానికి ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లినప్పుడు అంటుకుంది. లేటెస్టుగా కరోనాతో వార్తల్లో ఉన్న సినీ ప్రముఖుల గురించి ఈ సంగతి తెలిసినప్పుడు, పెద్దపెద్దోళ్లు కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా.. అని మనం ముక్కున వేలేసుకోవాల్సిందే.
Also Read : తలాక్.. తలాక్.. తలాక్.. హైదరాబాద్ మరో కేసు











