(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆలయాలపై దాడుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతే ప్రధాన కారణమని, రాష్ట్రంలో మనుషులకే కాదు, దేవాలయాలకు, దేవతా విగ్రహాలకు కూడా భద్రత కొరవడటం పాలకుల చేతగానితనానికి నిదర్శనమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై కోదండరాముని విగ్రహం ధ్వంసం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థంలో దుశ్చర్యకు పాల్పడ్డ నిందితులపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 4శతాబ్ధాల చరిత్ర ఉన్న రామతీర్ధం పుణ్యక్షేత్రంలో విగ్రహాల ధ్వంసం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తార్కాణమని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై వరుస దాడులు, విధ్వంసాలు అనేకం జరుగుతున్నా జగన్మోహన్‌రెడ్డి చోద్యం చూడటం గర్హనీయమన్నారు. 19నెలల్లో 120పైగా ఆలయాలపై దాడులు, విధ్వంసాలు జరిగాయన్నారు. ఒక పథకం ప్రకారమే రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల ధ్వంసం జరుగుతోందన్నారు.
రథాలు తగులబెట్టినప్పుడే ..
పిఠాపురంలో 6 దేవాలయాల్లో 23విగ్రహాల ధ్వంసం, గుంటూరులో దుర్గమ్మ ఆలయం కూల్చివేత, సింహాద్రి అప్పన్న గుడిలో, తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి)లో, శ్రీశైలంలో, విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అపచారాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. అన్యమత ప్రచారాల ద్వారా ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారని, జగన్మోహన్‌రెడ్డి పాలనలో మనుషులకే కాదు, దేవాలయాలకు, దేవతా విగ్రహాలకు కూడా భద్రత కొరవడటం దురదృష్టకరమని, చేతగాని తనానికి నిదర్శనమని అన్నారు. పరిపాలన చేతగాక కులాల వారీగా,మతాల వారీగా చిచ్చుపెట్టి ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్వేది, బిట్రగుంట దేవాలయాల్లో రథాలకు నిప్పు పెట్టినప్పుడే కఠిన చర్యలు చేపట్టివుంటే ఇన్ని దుశ్చర్యలు జరిగేవి కావన్నారు. ఇప్పటికైనా రామతీర్థం కొండపై దుశ్చర్యలకు పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Also Read: రగడ: సీఎం జగన్ ఫ్లెక్సీలను చించేశారు