మదనపల్లెలో మద్యం మత్తులో దారుణం..!
చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం వలసపల్లెలో దారుణం చోటు చేసుకుంది. మొక్కు చెల్లించుకునే క్రమంలో అపశృతి చోటు చేసుకుంది. మద్య మత్తులో అమ్మవారికి బలిచ్చే పొట్టేలు తల అనుకుని పక్కనే ఉన్న మనిషి తల నరికేశాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో పక్కనే ఉన్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆదివారం అర్థరాత్రి వలసపల్లెలో ఐదు నెలల చిన్నారికి వెంటనే చేయాల్సిన ఓపెన్ హార్ట్ సర్జరీకి దేవుడు సాయం కావాలని బలిచ్చేందుకు పొట్టేలు తీసుకొచ్చారు. ఊరి పొలిమేర ఉన్న గ్రామ దేవతకు ఆ పొట్టేలును బలిచ్చేందుకు పట్టుకుని ఉన్న తలారి సురేష్ (35) ను చలపతి అనేవ్యక్తి నరికాడు. మద్య మత్తులో ఉండి పొట్టేలు బదులు సురేష్ మెడపై కత్తితో వేటు వేశాడు. దీంతో కొన ఊరితో రక్తపు మడుగులో ఉన్న సురేష్ ను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటన పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.