రైతును చెప్పుతో కొట్టే యత్నం చేసిన ఎమ్మెల్యే మాటే నెగ్గిందిగా!?
వినుకొండ నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు మూడు ముక్కాలాటైంది! నియోజకవర్గానికి శాసన సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న బొల్లా బ్రహ్మనాయుడు తీరు వైసీపీ కేడర్ కు తలనొప్పిగా మారింది. బొల్లా వాడే పరుషపదజాలం నచ్చక.. చాలా వరకు నేతలు ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేల దుందుడుకు చర్యలు, స్వార్థపూరిత నిర్ణయాలకు విసిగివేజారి జిల్లాలో చాలా వరకు వైసీపీ కేడర్ ఎమ్మెల్యేలను దూరం పెట్టి.. పార్టీ ముఖ్యనేతలు, ఎంపీలతో టచ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని వినుకొండ నియోజకవర్గంలో ఎంపీ లావు, స్థానిక ఎమ్మెల్యే బొల్లా మధ్య ఓ కేసు విషయంలో అధిపత్య పొరపచ్చాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. నియోజకవర్గ పరిధిలోని శావల్యపురం మండలంలో అధికారపార్టీ కి చెందిన నరేంద్ర ను ఎంపీ లావు ఎదుట ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చెప్పు తీసుకుని, బూతులు తిడుతూ కొట్టబోయాడు. అంతటితో ఆగకుండా వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ ను ఆదేశించి, నరేంద్రపై అక్రమ కేసు బనాయించేలా చర్యలకు ఉపక్రమించాడు బొల్లా. దీనిపై స్పందించిన ఎంపీ లావు .. సదరు సీఐపై డీజీపీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఉన్నతాధికారులు ఆదేశాలకు మేరకు సీఐను సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సోషల్ మీడియా, సొంత పార్టీ నేతలు ఎమ్మెల్యే బొల్లా, సీఐ అశోక్ కుమార్ పై దుశ్చర్యలను బహిరంగానే ఎండగట్టారు. వస్తున్న కామెంట్స్, తనను నమ్ముకుని అక్రమ కేసు పెట్టి, బలైన సీఐ ను రక్షించుకునేందుకు ఎమ్మెల్యే బొల్లా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వద్ద చక్ర తిప్పి.. సీఐ సస్పెన్సన్ ఎత్తివేయించినట్లు తెలుస్తోంది!
ఎంపీ చెప్పిన రైతుకు న్యాయం జరగలేదుగా!?
అధికారపార్టీకి చెందిన బాధితుడు నరేంద్ర శావల్యపురం మండలం, వేల్పూరు గ్రామంలో ఒక రైతు. ధాన్యం కొనుగోలలో రైతులు పడుతున్న ఇబ్బందులను గ్రామ పర్యటనలో ఉన్న ఎంపీ లావు, ఎమ్మెల్యే బొల్లా దృష్టికి తీసుకొచ్చాడు. దీనిని జీర్ణించుకోలేని బొల్లా నోటి దురుసును ప్రదర్శించి, కాలికున్న చెప్పు తీసి కొట్టబోయాడు. అంతేకాక నరేంద్ర పై తన పీఏ తో అక్రమ కేసు ఒకటి పెట్టించారు. దీనిపై రూరల్ సీఐ అశోక్ కుమార్ కేసు నమోదు చేసి, నరేంద్రను అరెస్ట్ చేశారు. సీఐ తీరును ప్రశ్నిస్తూ.. ఎంపీ లావు డిజీపీ ఫిర్యాదు చేయగా.. రూరల్ సీఐ అశోక్ కుమార్ ను సస్పెండ్ చేయాల్సిందిగా గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ ను అదేశించారు. దీంతో సదరు సీఐపై చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలో సీఐ చాలా మంచోడు, నరేంద్ర అనే రైతు మిమ్మిల్ని తిట్టాడని సీఎం వద్ద ఎమ్మెల్యే బొల్లా వాపోయి, సస్పెన్షన్ ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. దీంతో మరోసారి డీజీపీ జోక్యంతో సీఐ పై పడిన వేటును తొలగిస్తూ రహస్య ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపధ్యం రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వమే చేతికి సంకేళ్లు వేసేందిగా అంటూ.. జగన్ ప్రభుత్వ వైఖరిని, ఎమ్మెల్యే బొల్లా తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని అధికారపార్టీ నేతలు కూడా ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు.