గుడివాడలో కోడి పందేలు@ రూ. 10 కోట్లు!
గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ ప్రాగణంలో ఏర్పాటు చేసిన కోడిపందాలు ఏపీ లో కొత్త రికార్డ్ పందాలుగా నిలిచాయి. ఈ పందాల ద్వారా దాదాపు రూ. 10 కోట్లకు పైగా నగదు చేతులు మారినట్లు సమాచారం! ఒక్క కనుమ పండుగనాడే రెండు కోట్లకు పైగా పందాలు కాసినట్లు తెలుస్తోంది. అందులో రూ. 54 లక్షల కోడి పందేం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఇదే పెద్ద కోడి పందెంగా అభివర్ణిస్తున్నారు జూదర్లు! రూ. 54 లక్షల కోడి పందెంలో అల్లూరి సుబ్రమణ్యం కోడిపై, కొవ్వాడ అన్నవరం కోడి పందెం గెలిచిన కొత్త రికార్డును నెలకొల్పింది. మరోవైపు ఏలూరు రోడ్డు నుంచి లింగవరం ‘కే’ కన్వెన్షన్ ప్రాంగణం వరకూ జూదాలు మూడు రోజులుపాటు ఓ రేంజ్ లో సాగాయి. కోడి పందాలు,పేకాట వంటి వంద రకాల జూదాలు యథేచ్ఛగా సాగుతున్నా.. పోలీసులు ఆ వైపు చూసేందుకు ఇష్టపడలేదు. గుడివాడ డివిజన్ లోని మంత్రి కొడాలి నాని ఇలాకాలలో తొమ్మిది మండలాల్లో కోడి పందాలతోపాటు గుండాట, కోతముక్క వంటి జూదాలు రాత్రి, పగలు తేడా లేకుండా బహిరంగంగానే నిర్వహించడం పెద్ద చర్చకు దారితీస్తోంది! మరోవైపు మంత్రి కొడాలి కన్వెన్షన్ సెంటర్లో కేసినో తో ప్రజా ప్రతినిధులు ఆడిపాడి చిందేశారు. ఈ వినోదభరిత జూద సంబరాల ద్వారా రూ.150 కోట్లు మేరకు వ్యాపారం సాగినట్లు సమాచారం!
సాంప్రదాయాన్ని జూద వ్యసనంగా మార్చారుగా!?
సాంప్రదాయంగా సాగాల్సిన సంబరాలకు జూదం, పందెం అనే రంగులు పులిమి అధికార పార్టీ సాగించిన క్రీడా.. నభూతో న భవిష్యతి అనే చెప్పాలి! గతంలో ఎన్నుడూ లేని విధంగా కోడిపందాలు బరులు, పేకాట శిబిరాలు ఏపీ వ్యాప్తంగా నిలిచాయి. వందల కోట్లు నగదు చేతులు మారింది. సంక్రాంతిని సంబరాలను.. జూద జాతరగా మార్చిన జగన్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని నెట్టింట్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పందెం గెలిచిన వారికి పండుగ, ఓడిన వారికి దండగా అన్న రీతిలో సాగిన కోడి పందాలపై ప్రభుత్వ ఉదాసీనతను, ఒంటెద్దు పొకడలను గుర్తు చేస్తున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా మంత్రులు, ఎమ్మెల్యేలు దెగ్గరుండి మరి కోడి పందాలను నిర్వహించారు. ఉమ్మడి ఏపీ మొదలుకుని.. నేటి వరకు ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కనీవినీ ఎరుగరని రీతిలో కోడి పందాలు జరిగాయి. అందులో గుడివాడలో పందాలు రికార్డు స్థాయిలో జరగడం గమనార్హమని ప్రజలు కోడై కూస్తున్నారు!