తన వయసు కేవలం 15 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులోనే శాస్త్రవేత్తగా, సరికొత్త విధానాలను ఆవిష్కృతం చేసిన బాల మేధావిగా పేరు గాంచింది. టైమ్ మ్యాగజైన్ ‘కిడ్ ఆఫ్ ద ఇయర్’గా ముఖచిత్రానికి ‘గీతాంజలి రావ్’ని ఎంపిక చేసింది. మరి అంతటి గౌరవం లభించడానికి గీతాంజలి సాధించిన ఘనత ఏంటి? అసలు ఇంత చిన్నవయసులో తను ఇంతటి స్ధాయికి ఎలా చేరుకుంది? మరి తన విశేషాలను తెలుసుకుందాం రండి…
అపరమేధావి
కేవలం 15 ఏళ్ల వయసుకే నీటిలోని లెడ్ శాతాన్ని గుర్తించే పరికరాన్ని కనిపెట్టిందీ చిన్నారి శాస్త్రవేత్త. అంతేకాదు, ఇంకా ఎన్నింటిపైనా పరిశోధనలు నిర్వహిస్తూ సరికొత్త విషయాలను అన్వేషించడం తనుకు చాలా ఆసక్తి అని చెప్పుకొచ్చింది. తన మేధాసంపత్తిని గుర్తించి టైమ్ మ్యాగజైన్ మొట్టమొదటి సారిగా ఒక 15 ఏళ్ల చిన్నారిని ముఖచిత్రానికి ఎంపిక చేసింది. అంతేకాదు, హాలివుడ్ తార ఏంజలెనా జోలి ఈ చిన్నారిని ఇంటర్వూ చేయడం మరొక అద్భుతం అని చెప్పచ్చు. కరోనా కారణంగా వీడియో ద్వారా జరిగిన ఈ ఇంటర్వూలో గీతాంజలి తన పరిశోధనల గురించి పలు విషయాలు పంచుకుంది.
నీటి రూపంలో విషాన్ని తాగుతున్నారు
ఈ చిన్ని మేధావికి బీజం 4-5 ఏళ్ల వయసులోనే పడింది. తన అంకుల్ గిఫ్ట్‌గా ఇచ్చిన కెమిస్ట్రీ కిట్‌ని ఒక్కరోజులో అరేంజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మనకు ఏది నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే దానిపై దృష్టి నిలపాలని, అప్పుడే మనం ఏదైనా సాధించగలమని చెప్పుకొచ్చింది. ప్రస్తుత కాలంలో అందరూ నీటి రూపంలో విషాన్ని తాగుతున్నారని, శుభ్రమైన నీటిని తాగే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ నీటిలోని కొన్ని పదార్ధాలు మనకు అనారోగ్యాలను కలిగిస్తాయి. వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు తన ప్రయోగం ఎంతగానో ఉపకరిస్తుందని చెప్తుందీ చిన్నారి.
లెడ్ ని గుర్తిస్తుంది
నీటిలో లెడ్ కలవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చిన్న తలనొప్పితో మొదలై చర్మ సమస్యలకు దారితీస్తాయి. మరి లెడ్ ప్రమాదకర స్థాయిని గుర్తించడానికి ఒక ప్రత్యేక పరికరాన్ని కనిపెట్టింది గీతాంజలి. ఈ పరికరం ద్వారా నీటిలోని లెడ్ శాతాన్ని గుర్తించవచ్చు. ఇది యాప్ ద్వారా మీ మొబైల్ కి ఫలితాలను అందిస్తుంది. ఈ పరికరం కార్బన్ నానోట్యూబ్ సెన్సార్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. దీని వల్ల ప్రమాదకరమైన లెడ్ ని గుర్తించి నీటిని శుభ్రపరిచేందుకు అవకాశం ఉంటుంది. దాదాపు 5,000 మంది టైమ్ మ్యాగజైన్ ముఖచిత్రానికి పోటీ పడగా అందులో గీతాంజలి ఎంపిక కావడం విశేషం.
రూపుదిద్దేవారిదే ఈ ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా రూపుదిద్దాలనుకునే వారికే ఈ లోకం సొంతం అవుతుంది అంటూ భారతీయ సంతతి చిన్నారి ఆవిష్కరణను ఉద్దేశించి టైమ్ మ్యాగజైన్ వ్యాఖ్యానించడం విశేషం. ముఖచిత్రానికి ఎంపికైన గీతాంజలి తన ఆవిష్కరణకు గుర్తింపు లభించినందుకు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘నేను చేయగలిగానంటే ఎవరైనా చేయగలరు’ అని చెప్పుకొచ్చింది. అందరూ సరికొత్త ఆవిష్కరణలతో మెరుగైన ప్రపంచాన్ని తీర్చిదిద్దాలని, మన సమస్యల పరిష్కారాలు నేటి తరం ఆలోచనలలో ఉన్నాయని, వాటికి కాస్త పదును పెడితే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపచ్చని చెప్పారు.
ఈ ఇండో-అమెరికన్ టీనేజ్ అమ్మాయి మేధావితనం చూస్తుంటే వావ్ అనిపించకమానదు. మరి తన ఆవిష్కరణకు కంగ్రాట్స్ చెప్పి, మరిన్ని సరికొత్త ఆవిష్కరణలతో మన ముందుకు రావాలని కోరుకుందాం.











